బంజారాహిల్స్,మే 11 : పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అత్యంత సంక్లిష్టమైన కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) శస్త్రచికిత్సను బంజారాహిల్స్‌లోని రెనోవా-ఎన్ఐజీఎల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెనోవా డైరెక్టర్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డా.ఆర్వీ రాఘవేంద్రరావు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అతుల్‌కుమార్ దుబే(45) పుట్టుకతోనే కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అడ్వాన్స్ సిర్రోసిస్ లివర్ ఫెయిల్యూర్‌గా పిలిచే ఈ వ్యాధి తీవ్రత రెండేళ్లుగా మరింత అధికమై కాలేయానికి రక్తాన్ని తెచ్చే నాళాలు పూర్తిగా పూడిపోవడంతో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. దేశంలోని అనేక ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోవడంతో రెనోవా ఆస్పత్రిలో చేరాడు. ఒకే బ్లడ్ గ్రూపు కలిగిన అతుల్‌కుమార్ దుబే భార్య మమతా దుబే కాలేయం కొంతభాగాన్ని దానం చేసేందుకు సిద్ధంకాగా ఇటీవల కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతం కాలేయ మార్పిడి చేయించుకున్న అతుల్‌కుమార్ దుబే, ఆయన భార్య మమతా దుబే కోలుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్లు పాండురంగారావు, లత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.