దేశంలోని ఏ మెట్రో నగరానికి లేనంతగా తాగునీటికి భరోసా ఉన్న హైదరాబాద్ మహా నగరంలో మరో వందేళ్లకు సైతం ఢోకా లేకుండా నీటి వనరులు సిద్ధమవుతున్నవి. మండు వేసవిలోనూ పుష్కలమైన నీటి సరఫరాతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌కు ఇక శాశ్వత ప్రాతిపదికన కృష్ణాజలాలను అందించే సుంకిశాల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పథకంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన 36 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ వ్యవస్థకు కూడా తాజాగా గ్రీన్‌సిగ్నల్ రావడంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరానికి వివిధ నీటి వనరుల ద్వారా రోజుకు 47 కోట్ల గ్యాలన్ల మంచినీరు సరఫరా అవుతున్నది. ఇందులో ప్రధానంగా నాగార్జునసాగర్ జలాశయం నుంచి మూడు దశల ప్రాజెక్టులతో రోజుకు 27 కోట్ల గ్యాలన్ల (ఏడాదికి 16.5 టీఎంసీలు) కృష్ణాజలాలు వస్తున్నాయి. మరోవైపు ఎల్లంపల్లి జలాశయం నుంచి రోజుకు 17.2 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలు వస్తున్నాయి. అయితే వందల కిలోమీటర్ల దూరంలోని ఆయా జలాశయాల నుంచి మార్గమధ్యలో శుద్ధి అవుతూ నగరానికి పైపులైన్ల ద్వారా నీరు వస్తున్నది. ఈ నేపథ్యంలో సరఫరా వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. మరీ ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత అనేది హైదరాబాద్ తాగునీటి సరఫరా మీద తీవ్ర ప్రభావం చూపుతున్నది. అటు ఎల్లంపల్లి, ఇటు నాగార్జునసాగర్ జలాశయాల్లో నిర్ణీత మట్టాల్లో నీటి లభ్యత ఉంటేనే నగరానికి నీటి సరఫరా అనేది ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ నగర తాగునీటి వ్యవస్థ ఇలా డోలాయమానంగా ఉండొద్దనే సంకల్పంతో శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
కేశవాపూర్ వద్ద రిజర్వాయర్
గోదావరికి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీతో కేశవాపూర్ వద్ద భారీ ఎత్తున గోదావరి జలాల నిల్వకు రిజర్వాయర్ నిర్మాణం జరుగనున్నది. ఇప్పటికే భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయినది.
గ్రేటర్ ప్రస్థానంలో చారిత్రక పథకం
– కృష్ణాకు సంబంధించి నాగార్జునసాగర్ జలాశయంలో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే నగరానికి నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా ఉంటుంది. లేనట్లయితే సాగర్ ఫోర్‌షోర్‌లోని పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లను ఏర్పాటు చేసి నగరానికి నీటిని అందించాల్సిన విషమ పరిస్థితి నెలకొంటుంది. గతంలో అనేక వేసవిల్లో ఇలా ఏర్పాటు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా కాకుండా సాగర్ జలాశయంలో డెడ్‌స్టోరేజీకి నీటి పరిమాణం చేరినప్పటికీ హైదరాబాద్ మహానగర నీటి సరఫరాకు ఢోకా లేకుండా ఉండేందుకే సుంకిశాల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. దీంతో వరుస సంవత్సరాలు కృష్ణా నదికి వరదలు రాని విషమ పరిస్థితి నెలకొన్నప్పటికీ.. సాగర్ జలాశయంలో 132 టీఎంసీల నీటి నిల్వ ఉండే డెడ్‌స్టోరేజీ అంటే 462 అడుగుల స్థాయిలోనూ హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా నిరవధికంగా కొనసాగించవచ్చు. అందుకే గ్రేటర్ ప్రస్థానంలో ఈ పథకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నది.
రెండేళ్లలో పూర్తిస్థాయి నిధులు..
సాధారణంగా ప్రభుత్వాలు పథకాలు చేపడితే.. ఏండ్ల తరబడి కేటాయింపులు జరుపుతూ సాగదీస్తుంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం సుంకిశాల పథకానికి కేవలం రెండు బడ్జెట్లతోనే పూర్తిస్థాయి నిధులు సమకూర్చింది. విశ్వ నగరమైన హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. రూ.1400 కోట్లు కేటాయించడంతో కించిత్తు నిధుల సమస్య లేకుండా పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం మేర పనులు పూర్తయినట్లు తెలిసింది. పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల పరిధిలోని సాగర్ జలాశయ ఫోర్‌షోర్ వద్ద ఇన్‌టెక్, డ్రైవెల్ (సర్జ్పుల్లాంటిది), సొరంగం, తదితర పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
32 మెగావాట్ల సామర్థ్యంతో..
సాగర్ నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకుగాను అక్కడ 1.2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 18పంపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుం ది. ఇందుకోసం 32 మెగావాట్ల సామర్థ్యంతో ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఏర్పాటుకు తాజాగా ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వరకు పథకాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ పథకం పనులను పరిశీలించేందుకు గాను శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నగర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.