సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ) /ఖైరతాబాద్ : హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కాకుండా అవసరమైన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తున్నామని, ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ మెరుగుపర్చామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం పంజాగుట్ట చౌరస్తా హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద రూ.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ)ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మేయర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంజాగుట్ట జంక్షన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్‌తో రోడ్డు దాటేందుకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వంతెన ప్రారంభంతో సులువుగా రోడ్డు దాటొచ్చన్నారు. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సుమారు 40 చోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్నిచోట్ల అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఫుట్ఓవర్ బ్రిడ్జీలు ముంబయి తర్వాత హైదరాబాద్‌లోనే అధికమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఇన్చార్జి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇందిరాబాయి,టీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, మహేందర్‌బాబు, రాంమూర్తి, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మరో 6 ప్రారంభం
పాదచారుల సౌకర్యార్థం గ్రేటర్‌వ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ తెలిపారు. వచ్చే 4-6 వారాల్లో మరో ఆరుచోట్ల ఎఫ్‌వోబీలను ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఆధునిక హంగులు
పంజాగుట్ట ఎఫ్వోబీని ఆధునిక హంగులతో నిర్మించారు. బ్రిడ్జి మొత్తం మిల్డ్స్టీల్తో చేపట్టగా,పాదచారులు నడిచేందుకు రెయిలింగ్, రూఫ్ షీట్స్, గ్లాస్ ఫిట్టింగ్స్, లూవర్స్, లిఫ్టులు, రెండు వైపులా ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. వానకాలంలో ఇబ్బంది రాకుండా బ్రిడ్జి మొత్తం రూఫ్‌తో నిర్మించారు. కిందిభాగంలో బోలార్డ్స్ అమర్చారు.