సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : అనారోగ్యంతో చికిత్స పొందిన దంపతులకు ఆరోగ్య బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్‌కు చెందిన నారాయణ, ఇందిర దంపతులు 2016లో ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. అదే ఏడాది నారాయణ గుండె సంబంధిత వ్యాధితో అమీర్‌పేట్‌లోని ఓ దవాఖానలో చేరారు. తనకు స్టంట్లు అమర్చారని, అందుకు వైద్య ఖర్చులు చెల్లించాలని నారాయణ స్టార్హెల్త్ అలైడ్ కంపెనీకి విజ్ఞప్తి చేశారు. అదే ఏడాది అతని భార్యకు పక్షవాతం రాగా అదే వైద్యశాలలో చేరింది. చికిత్స అనంతరం బాధితులు వైద్య ఖర్చులు చెల్లించాలని స్టార్హెల్త్ సంస్థను అభ్యర్థించగా తిరస్కరించింది. దీంతో బాధితులు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం-3ని ఆశ్రయించారు. ఫిర్యాదుదారులు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇరువురి పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం బాధితులకు బీమా డబ్బులు చెల్లించాలని హైదారబాద్ వినియోగదారుల ఫోరం-3 అధ్యక్షుడు ఎం.రాంగోపాల్‌రెడ్డి స్టార్హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. దంపతులకు వైద్య ఖర్చుల కింద రూ.5,65,976లు, రూ. 9,445.30పైసలను 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, నష్టపరిహారం కింద రూ.25వేలు, మరో రూ.10వేలు ఇతర ఖర్చుల కింద బాధితులైన దంపతులకు 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.