సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): నిందితుడి డెబిట్ కార్డు నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకున్న రాచకొండ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ వ్యవహరం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ఫిబ్రవరి నెలలో రాచకొండ పోలీసులు హర్యానాకు చెందిన జంషీద్, రాఫిల్ ఖాన్, ఆజాద్‌ను అరెస్టు చేశారు. ఈ ముఠా తమిళనాడు నుంచి హర్యానాకు వెళ్తుండగా డ్రైవర్, క్లీనర్లను బంధించి 192 లారీ టైర్ల కంటెయినర్‌ను హైజాక్ చేశారు. ఆ తర్వాత ఆ లోడ్‌ను కాటేదాన్‌లోని ఓ గోడౌన్లో ఖాళీ చేసి, కంటెయినర్తోపాటు డ్రైవర్, క్లీనర్లను ఓఆర్ఆర్ వద్ద వదిలేశారు. ఈ ఇద్దరు ఫిర్యాదుతో ఎల్బీనగర్ సీసీఎస్, పహాడిషరీఫ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఈ 192 లారీ టైర్లను బేగంబజార్‌కు చెందిన వ్యాపారి కమల్ కాబ్రతో పాటు అఫ్రోజ్, బాసిత్లకు విక్రయించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కమల్ కాబ్రను కూడా అరెస్టు చేశారు.
తిరుపతిలో నగదు ఉపసంహరణ
విచారణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ నిందితుడైన కమల్ కాబ్ర నుంచి డెబిట్ కార్డుతో పాటు పిన్ నెంబర్‌ను కూడా తెలుసుకున్నాడు. కమల్ కాబ్ర నెల రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత వ్యాపార లావాదేవీల్లో భాగంలో ఒకరికి చెక్ ఇవ్వగా, అది బౌన్స్ అయ్యింది. దీంతో కంగుతిన్న కమల్ కాబ్ర బ్యాంక్‌కు వెళ్లి ఖాతాలోని నగదు మాయంపై ఆరా తీశాడు. అతని ఖాతా నుంచి రూ. 5.47 లక్షలు తిరుపతిలో విత్‌డ్రా చేసినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువచ్చాడు. ఆయన ఆదేశాలతో ఎస్వోటీ, సీసీఎస్‌తో పాటు మరికొన్ని బృందాలు రంగంలోకి దిగి తిరుపతిలో నగదును విత్‌డ్రా చేసిన మహిళను గుర్తించారు. ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ జరుగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా పహాడీషరీఫ్ పీఎస్‌లో ఓ మహిళ మాస్క్ ధరించి రూ. 5 లక్షల నగదు కవర్‌ను రిసెప్షన్ దగ్గర వదిలేసింది. సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో సీసీఎస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ చేబితేనే చేసినట్లు వాంగ్మూలం ఇచ్చింది. పూర్తి ఆధారాలు సేకరించిన బృందాలు ఆ నివేదికలను ఉన్నతాధికారికి ఇచ్చారు. ఆ నివేదికలను విశ్లేషించి సీసీఎస్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌ను రేంజ్‌కు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై మాట్లాడేందుకు రాచకొండ పోలీసు అధికారులందరూ నిరాకరిస్తున్నారు.