సుల్తాన్ బజార్, మే 10: గ్రేటర్ హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే అర్చకులకు ధూప, దీప, నైవేద్యం అందించడానికి కృషి చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌తో పాటు వరంగల్, ఖమ్మం, క రీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల కార్పొరేషన్లలో కూడా ఈ ధూప, దీప, నైవేద్యం పథకాన్ని పేద అర్చకులకు వర్తింపజేయాలని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. రాష్ట్రంలో 6ఏ, 6బీ, 6సీ దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలను అందించేందుకు 2017లో రాష్ట్ర సీఎం కేసీఆర్ 577జీవోను ఇచ్చారన్నారు. ఇదిలా ఉండగా, 2014 జూన్ 2 వరకు ఉన్న అర్చకులను మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు ఇస్తామని కట్ ఆఫ్ డేట్ 121 జీవోను తీసుకువచ్చి దేవాదాయ శాఖ అధికారులు కొంతమంది అర్చక ఉద్యోగులకు అన్యాయం చేశారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు.
ఈ 121 జీవోను వెంటనే తొలగించి 577 జీవో ఇచ్చిన తేదీ వరకు ఉన్న అర్చక, ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆర్ధిక పరిపుష్టి కలిగిన దేవాలయాల నుంచి లేదా పే స్కేల్ వర్తింపజేసి వేతనాలను అందించాలని కోరారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుకూలంగా అర్చక వెల్ఫేర్ ట్రస్టుకు వెంటనే సభ్యుల నియామకం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక, ఉద్యోగ జేఏసీ ఉపాధ్యక్షులు టి.రాజేశ్వర శర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రఘు కిరణాచార్యులు తదితరులు పాల్గొన్నారు.