మేడ్చల్ రూరల్, మే 10 : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అషామాషీ కాదు. ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. అనువైన పుస్తక సామగ్రి, అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఇలాంటి పరిస్థితులను మేడ్చల్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కల్పిస్తున్నది. ప్రతిరోజు 70 నుంచి 80 మంది వివిధ ఉద్యోగాలకు సంసిద్ధమవుతున్న అభ్యర్థులు గ్రంథాలయానికి వస్తున్నారు. మేడ్చల్ పట్టణంతోపాటు పరిసర గ్రామాలు, పక్కన ఉన్న శామీర్పేట మండలం నుంచి సైతం అభ్యర్థులు గ్రంథాలయానికి తరలివస్తున్నారు. పాఠకులకు అనువుగా ఉండే కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు తదితర సకల వసతులు కల్పించారు. అంతేగాకుండా మార్కెట్లో నూతన సమాచారంతో విడుదలయ్యే కరెంట్ అఫైర్స్, అప్టిట్యూడ్, రీజినింగ్ తదితర పుస్తక సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నారు.