బోడుప్పల్, మే 9: దోస్తులు పార్టీకి పిలిచారని, వీకెండ్ కదా సరదాగా రెండు పెగ్గులేసి ఇంటికి పోదాంలే…ఏమీ కాదులే అనుకుంటే పొరబడినట్లే. కచ్చితంగా పైసలు పోతయ్..పరువు పోతది. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు, ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్న సంఘటనలు అనేకం. ప్రమాదానికి కారణం అయిన వారిపట్ల న్యాయస్థానాలు సీరియస్ అవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిలిపివేసిన ట్రాఫిక్ పోలీసులు బీఏసీ టెస్ట్‌లు ముమ్మరం చేస్తూ చుక్కేసిన మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికితే చలానాతో సరిపెట్టుకోవచ్చులే అని వాహనదారులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇప్పుడు పెగ్గేసి దొరికితే జరిమానా విధించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సలేషన్‌కు ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌తో పాటు ట్రాఫిక్ డ్యూటీ కూడా విధిగా చేయిస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కఠిన చర్యలు…
ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు పక్కా ఆధారాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. బ్లడ్ ఆల్కహాలింగ్ కాన్టెంట్(బీఏసీ)లో వచ్చిన ప్రింట్ ఆధారంగా ఎంవీ యాక్టు 185 కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు.బ్రీత్ ఆల్కహాల్ ఎనలైజర్ టెస్ట్‌లో 36 యంజీ దాటిన మద్యం ప్రియులపై కేసు నమోదు చేస్తున్నారు. ఉప్పల్, నాచారం, మేడిపల్లి పీఎస్ పరిధిలో రాంగ్ పార్కింగ్, విత్ అవుట్ హెల్మెంట్, త్రిబుల్ రైడింగ్ కింద ఈ చలాన్లు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉప్పల్ పీఎస్ సర్కిల్ పరిధిలో ఈ చలాన్ కేసులు 41 సీపీయాక్ట్ కింద రోజుకి వెయ్యికి పైగా నమోదు కావడం గమనార్హం. వీరికి సుమారు రూ.100 పెనాల్టీ విధిస్తున్నారు. మూడు పీఎస్‌ల పరిధిలో 450 నుంచి 500 వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. ఏఎస్ఐ అధికారి ఆధ్వర్యంలో ప్రతి రోజు రూ.90వేల నుంచి రూ.లక్ష వరకు పెండింగ్ చలాన్లు వసూలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ప్రమాదాలు నివారించేందుకే…
విలువైన ప్రాణాలు రక్షించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాం. మద్యం తాగి వాహనాలు నడుపడంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ఎంతో మంది అమాయకులు వారి ప్రాణాలు కోల్పోతున్నారు. బీఏసీ టెస్ట్‌లో 36 యంజీ దాటిన వారికి రూ.2500 చలాన్ విధించి, కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే అనర్దాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నదే మా తపన.
-ఎండీ మక్బుల్జానీ,ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్