అంబర్‌పేట, మే 8 : వానకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనుల్లో జోరు పెంచారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్ల పరిధిలో ఉన్న వర్షపునీటి నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించే పనులు ఇప్పటికే మొదలుపెట్టి చకచక కానిస్తున్నారు. అన్ని డివిజన్లలో ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా నల్లకుంట పరిధిలోకి వచ్చే హుస్సేన్‌సాగర్ నాలా, శివానందనగర్ నాలా, టీఆర్టీ కాలనీ, న్యూనల్లకుంట, గోల్నాక తదితర ప్రాంతాల్లో ఉన్న పెద్ద సైజు నాలాలను బకెట్ మిషన్లు పెట్టి పూడికతీత తీస్తున్నారు. అదే విధంగా బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని బతుకమ్మకుంట, సాయిమధురానగర్, జంజం మసీదు, డీడీ కాలనీ, మల్లికార్జుననగర్, రెడ్‌బిల్డింగ్, తురాబ్‌నగర్, కుమ్మర్వాడి ప్రాంతాలు, గోల్నాక డివిజన్లోని కాలా బ్రిడ్జి నాలా, తులసీరాంనగర్(లంక్ర) నాలా, కృష్ణానగర్, నెహ్రూనగర్, కమలానగర్, న్యూగంగానగర్, మారుతీనగర్, ఖాద్రిబాగ్, అన్నపూర్ణనగర్ తదితర ప్రాంతాలు, అంబర్‌పేట డివిజన్లోని బాపూనగర్, ప్రేంనగర్ నాలాలు, చెన్నారెడ్డినగర్, నరేంద్రనగర్, న్యూపటేల్నగర్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న నాలాల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తమ సిబ్బందిని పెట్టి పూడికను తీస్తున్నారు. వానలు మొదలయ్యే నాటికి నియోజకవర్గంలో పూడికతీత పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరద ముం పు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
వానకాలానికి ముందే పనులు పూర్తి
వానా కాలం ప్రారంభమయ్యే నాటికి పూడికతీత పనులన్నీ పూర్తి చేస్తాం. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో ఇప్పటికే పనులు మొదలయ్యాయి. అన్ని డివిజన్లలో చురుగ్గా సాగుతున్నాయి. నాలాల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తాచెదారం, వ్యర్థాలు మొత్తం తొలగించి ముంపు సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.
-శంకర్, జీహెచ్ఎంసీ ఈఈ