పహాడీషరీఫ్, జనవరి 3 : ఉస్మాన్‌నగర్‌లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్ చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీర్‌పేట చెరువు తరహాలో ఉస్మాన్‌నగర్ బూరాన్ఖాన్ చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారీ వర్షాలతో పాటు కాలనీలోని డ్రైన్‌వాటర్ మొత్తం చెరువులోకి చేరడంతో వర్షం నీరు వెనక్కి ప్రవహించి ఉస్మాన్‌నగర్‌లోని దాదాపు 200 ఇండ్లు ముంపునకు గురై రెండేండ్ల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ కుమార్, కౌన్సిలర్ మజర్ అలీ, టీఆర్ఎస్ నాయకులు యూసుఫ్ పటేల్, ఖైసర్బామ్ పాల్గొన్నారు.
మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలి
మహిళలు స్వశక్తితో స్వయం ఉపాధి పొందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడీషరీఫ్ ఎస్టీ హిల్స్ హై స్కూల్లో సోమవారం మహమ్మదీయ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది మహిళలకు సిర్టిఫికెట్లు, కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసోసియేషన్ సభ్యులు పేద మహిళలకు కుట్టమిషన్ నేర్పిస్తూ అందులో ప్రావీణ్యం కలిగినవారికి అందజేయడం సంతోషమన్నారు. అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జీపీ కుమార్, కోఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌ఖాన్, ఉపాధ్యక్షుడు గౌస్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమానుల్లాఖాన్, కోశాధికారి సయ్యద్ ఖరీద్, టీఆర్ఎస్ నాయకులు కొండల్‌యాదవ్, నాసర్ అవాల్గీ, యాస్మిన్‌బేగం, యూసఫ్ పటేల్, ఖైసర్బాయ్, యంజాల జనార్దన్, వాసుబాబు, విశాల్‌గౌడ్, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.