ఖైరతాబాద్, ఆగస్టు 24 : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేండ్లలో శాంతియుత వాతావరణం, మత సామరస్యం, శాంతి భద్రతల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె. ప్రసన్నతో కలిసి పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, పండుగలు సైతం అన్ని మతాలకు సంబంధించి గొప్పగా జరుగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరానికి లవబుల్ సిటీగా పేరుందని, ఇక్కడి సీసీ కెమెరాలు, హాస్పిటాలిటీ, ఇంత చక్కటి వాతావరణం ప్రపంచంలో ఎక్కడ ఉండదన్నారు. గడిచిన రెండు మూడు రోజుల నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలకు ఒక మంత్రిగానే కాకుండా పౌరుడిగా బాధను వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించే తరుణంలో ఇలాంటి లేని పోని సమస్యలకు అవకాశం కల్పించే విధంగా కొంత మంది చేస్తున్న కుట్రలను హైదరాబాద్ ప్రజలు గమనించాలన్నారు. ఎవరి మతాలు వారికి ఉంటాయని, ఎవరి దేవుళ్లకు వారు పూజ చేసుకుంటారని, విఘ్నేశ్వరుడితో పాటు వేలాది మంది దేవుళ్లను హిందువులు పూజిస్తుంటారని, క్రైస్తవులు, ముస్లిం, పంజాబీలు ఇలా భిన్న మతాలకు చెందిన వారు వారివారి ఆచారాలను పాటిస్తారని తెలిపారు. ఇలాంటి వాతావరణంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి శాంతి, సంయమనంతో మెలగాలన్నారు.
ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేకత ఉన్నదని, ఇక్కడ ప్రతిష్ఠించే గణేశుడు విశ్వవ్యాప్తమయ్యారని, దేశ, విదేశాల నుంచి దర్శనం కోసం వస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 50 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేయడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. బారీకేడింగ్, లైటింగ్, హెల్త్, పోలీసు, రోడ్ కనెక్టివిటీ, తాత్కాలిక టాయిలెట్స్ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ, పోలీసు తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రోత్సవాల సందర్భంగా చుట్టు పక్కల ఉన్న బస్తీల వాసులకు ఇబ్బందులు కలుగకుండా వెనుక వైపు నుంచి రోడ్డును ఐదారు రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. బారీకేడింగ్ కూడా టూవీలర్, ఫోర్ వీలర్ వారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఆరు లక్షల గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకటి, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, ఆర్అండ్బీ రవీంద్ర మోహన్, గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, సభ్యులు సింగరి రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల అజయ్, మహేందర్ బాబు, మహేశ్ యాదవ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.