కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 8 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీలోని కూకట్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి విద్యుత్ డివిజన్ల కార్యాలయంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ర్యాలీగా.. నగరంలోని విద్యుత్సౌధాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు.
కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకే విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తుందని విమర్శించారు. సవరణ బిల్లు ఆమోదం పొందితే పేదలు, రైతులపై మోయలేని విద్యుత్ భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ దిగిరాకపొతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు రాంమ్మోహన్, యాదయ్య, కుమార్, శ్రీనివాస్, లింగస్వామి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.