చాంద్రాయణగుట్ట, ఆగస్టు 8: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రాలను ప్రత్యేక షోలుగా సినిమా థియేటర్లలో ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చార్మినార్ జోనల్ కమిషనర్ నామా సామ్రాట్ అశోక్ తెలిపారు.
నర్కీపూల్ బాగ్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వజ్రోత్సవాల్లో భాగంగా జోన్ పరిధిలో మూసారాంబాగ్ పీవీఆర్ థియేటర్, శాలిబండ సుధా థియేటర్, బహదూర్‌పురా మెట్రో థియేటర్, అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్, సంతోష్‌నగర్ యాదగిరి థియేటర్లలో 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు 6వ తరగతి నుంచి పదో తరగతి చదువుకునే విద్యార్థులకు ఉచితంగా దేశభక్తిన్ని పెంపొందించే గాంధీ చిత్రాలను తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పాఠశాల విద్యార్థులను థియేటర్లకు తరలించేందుకు ఆర్టీసీ సహకారంతో 71 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాల కాంతులతో విరజిమ్మేలా త్రివర్ణ పతాకం అలంకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.