గోల్నాక/మలక్‌పేట, జూలై 29 : వచ్చే వానాకాలం నాటికి గ్రేటర్‌వ్యాప్తంగా నాలాల ప్రక్షాళన పనులు పూర్తి చేసి..ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. వరద ఉధృతికి దెబ్బతిన్న మూసారం బాగ్ బ్రిడ్జిని ఆయన శుక్రవారం హోం మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్, లావణ్యశ్రీనివాస్‌గౌడ్ తదితరులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ మూసీ వరదతో చిన్నగా ఉన్న మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జిలు తరచూ మునిగిపోతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త వంతెనలు నిర్మిస్తామని చెప్పారు. రూ.53 కోట్ల వ్యయంతో మూసారం బాగ్ హైలెవల్ బ్రిడ్జితో పాటు రూ.42 కోట్ల వ్యయంతో చాదర్‌ఘాట్ వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారని వెల్లడించారు.
పది రోజుల్లో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అవసరమైన చోట్ల రిటైనింగ్ వాల్స్ కూడా నిర్మిస్తామన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కాగా, మూడురోజులుగా మూసారం బాగ్ బ్రిడ్జిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు శుక్రవారం తిరిగి పునరుద్ధరించారు.