SSA | సిటీబ్యూరో: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగులు చెప్పారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.
‘రెగ్యులరైజ్ చేయాలి’
రవీంద్రభారతి: రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝూన్సీ సౌజన్య మాట్లాడుతూ 18 సంవత్సరాల నుంచి 1960 మందికి పైగా ఉద్యోగులు విద్యాశాఖ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులమైన తాము చాలా పేదరికంలో ఉన్నామని, చాలీచాలని జీతాలతో ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నామని చెప్పారు.
‘హామీలు విస్మరించడం శోచనీయం’
సుల్తాన్‌బజార్: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు హామీని విస్మరించడం శోచనీయమని ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్ ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్న సమగ్రశిక్ష దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన శ్రీకాంత్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేసేంతవరకు అండగా ఉంటామని శ్రీకాంత్ హామీనిచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం నాయకులు శ్రీనివాస్, ఇంద్రకంటి సరిత, నవనీత, శ్రీవాణి, రమ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.