సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్‌తో పోగొట్టుకున్న నగదును రికవరీ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం బాధితుడికి అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి నుంచి ఫెడెక్స్ కొరియర్ పేరు చెప్పి సైబర్ మోసగాళ్లు రూ.43 లక్షలు కాజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయించారు.
ఆ తర్వాత అమౌంట్ వాపస్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలంటూ బాధితుడికి సూచించారు. దీంతో 12వ ఏసీఎంఎం కోర్టు మెజిస్టేట్ అనిత ఉత్తర్వుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు, సంబంధిత బ్యాంకులు బాధితుల ఖాతాకు సొమ్మును వాపసు చేశాయి. ఈ మేరకు బాధితుడికి రూ.36,50,000 అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును పరిష్కరించడంలో ఇన్స్పెక్టర్ మధుసూదన్‌రావు, ఎస్ఐలు మహిపాల్, వెంకటేశ్, హెడ్‌కానిస్టేబుల్ మహేశ్వర్‌రెడ్డి, కానిస్టేబుల్ వెంకటేశ్‌లు ప్రతిభకనబరిచారని సైబర్‌క్రైమ్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.