సిటీబ్యూరో, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్న ఎనిమిదేళ్ల బాలికను తన సమయస్ఫూర్తితో రక్షించిన మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని పాత సీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి ఫిరోజ్‌ను శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం తో పాటు నగదురివార్డు అందజేశారు.
ఈనెల 1న అబిడ్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న బాలికను మెహిదీపట్నం హిల్స్‌కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ సలీం మాయమాటలు చెప్పి ఆటోలోకి ఎక్కించుకున్నాడు. బాలికను గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో ప్రార్థనామందిరం నుంచి బయటకు వస్తున్న ఫిరోజ్ అనే యువకుడు గమనించి ఆటోను అడ్డుకున్నాడు. వెంటనే ఆటోడ్రైవర్ ఆ బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
ఫిరోజ్ బాలిక ఐడీ కార్డులో ఉన్న పోన్ నంబర్ ఆధారంగా ఆమె తండ్రికి సమాచారమిచ్చారు. అదే సమయంలో అప్పటికే స్కూల్ దగ్గర బాలిక తల్లిదండ్రులు విలపిస్తున్నా రు. విధులు ముగించుకుని వెళ్తున్న అబిడ్స్ పీఎస్ బ్లూకోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్సింగ్లు గమనించి.. విషయం తెలుసుకుని గొల్కొండకు వెళ్లి బాలికను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో నిందితుడు సలీంను ఏప్రిల్ 2న అరెస్ట్ చేసిన పోలీసులు, ఆటోను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు. కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్సీపీ ఎన్.శ్వేత , డీసీపీలు కె.శిల్పవల్లి, శ్రీనివాస్, లావణ్యనాయక్ , అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.