సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సిటీ పోలీస్ పునర్వ్యవస్థీకరణతో పాటు నేరాల కట్టడి, జరిగిన నేరాలను ఛేదిస్తూ, దర్యాప్తులో వేగం పెంచాలని నగర పోలీసు అధికారులకు సీపీ సీవీ ఆనంద్ సూచనలు చేశారు. సోమవారం టీఎస్పీఐసీసీసీలో ఏసీపీ నుంచి ఆపై స్థాయి అధికారులతో నేరాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, ఆయా కేసుల్లో నిందితుల అరెస్ట్‌లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డు స్థాయిలో 85 శాతం అస్తి నేరాలను ఛేదిస్తున్నారని, సంచలనాత్మక కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై ఏసీపీలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రైమ్ డిటెక్షన్ ప్రాముఖ్యతను వివరిస్తూ, క్లూస్ టీమ్, దర్యాప్తు బృందాల మధ్య సమన్వయం ఉండాలని ఇది కేసుల దర్యాప్తులో మరిన్ని సాక్ష్యాలతో సమగ్రంగా ఉంటుందన్నారు.
సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడం, ఠాణాల్లో అధికారులకు నాణ్యమైన పరిశోధన సామర్ధ్యం పెంపుదలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పునర్వ్యవస్థీకరణతో ఏర్పాటవుతున్న కొత్త పోలీస్స్టేషన్లు, డివిజన్లు, డీసీపీ కార్యాలయాలు అందులోని వసతులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. డీకామో(డ్రోన్స్ అండ్ కెమెరాస్ మెయింటెనెన్స్ అర్గనైజేషన్) ఇప్పుడు పనిచేస్తుందని, సీసీ టీవీ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించాలని అధికారులకు సూచించారు.
సిటీ పోలీస్ ఆరోగ్యానికి సంబంధించిన ఫిట్కాప్లో 16,008 మంది సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన పర్యవేక్షణ జరుగుతుందన్నారు. పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలు, ఎస్సీఎస్సీ కార్యక్రమాలు, ఈ అఫీస్‌కు సంబంధించి, కంటోన్మెంట్లో రోడ్లు తెరవడం, సైరన్లపై స్పెషల్ డ్రైవ్, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ పనితీరు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్మాన్, సుధీర్‌బాబు, ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.