సిటీబ్యూరో, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్ పరిధి ఉమ్మడి సౌత్‌జోన్‌తో పాటు ట్రైకమిషనరేట్ పరిధిలో అల్లరిమూకలు, రౌడీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. సగటున రెండురోజులకో హత్య జరుగుతున్నది. ప్రధానంగా ఉమ్మడి సౌత్‌జోన్ పరిధిలో ఉన్న పాతబస్తీలోని కామాటిపురా, ఫలక్‌నుమా, రెయిన్‌బజార్, పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర పీఎస్‌ల పరిధిలో నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం, నిఘా వైఫల్యమే ఇందుకు కారణమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా పాతనేరస్తులు, రౌడీషీటర్లు, ఘరానా నేరస్తుల కదలికలపై పోలీసుల నిఘా లేకుండాపోయిందని నగరవాసులు అంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హత్యలను, హత్యాయత్నాలను, బెదిరింపులను పరిగణనలోకి తీసుకుంటే ఈ విషయం అర్థమవుతున్నది. ఉమ్మడి సౌత్జోన్లో జరుగుతున్న హత్యలు ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే జరుగుతున్నాయి. ఇటీవల వరుసగా జరిగిన హత్యలు చూస్తే దాదాపుగా అన్నీ రాత్రి వేళల్లోనే జరగడంతో ఆ సమయంలో గస్తీకాయాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ముందస్తు చర్యల కంటే తర్వాత అరెస్టులా..!
నగరంలో జరిగిన సంచలన హత్య కేసుల్లో పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ ఆరు రోజుల్లో జరిగిన కొన్ని హత్యలకు సంబంధించి నిందితులను వెంటవెంటనే పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే ఘటన జరగడానికి ముందే అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు.. ఆ తర్వాత హడావుడి చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీసీ ఫుటేజ్, మొబైల్ టవర్ డంప్ డేటా, డిజిటల్ సాక్ష్యాలతో కేసులు వేగంగా ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేరంగా జరిగి పోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా నేరం చేయాలంటేనే నేరస్తులు భయపడేలా చేయాలని , అప్పుడే క్రైమ్‌రేట్ తగ్గుతుందని సిటీ ప్రజలు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో రౌడీషీటర్లు పాల్గొనడం, మహిళలపై లైంగిక నేరాలు, పిల్లలపై పోక్సో కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువవడం ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి గొడవల్లో రాజకీయ నాయకుల కుటుంబాల ప్రమేయం, ఆ తర్వాత పోలీసుల బదిలీలు ఇవన్నీ ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నాయి. పోలీసులు, శాంతిభద్రతల అంశంలో మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయం సామాన్య ప్రజల నుంచి వస్తున్నది.
నిఘా వైఫల్యంపై విమర్శలు..!
వరుస హత్యల నేపథ్యంలో పోలీసుల పనితీరుపై నగరవాసుల నుంచి తీవ్రవిమర్శలు వస్తున్నాయి. అంతకుముందు రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ ఉండేది. రాత్రవేళల్లో ఎక్కువ నేరాలు జరగకుండా పోలీసులు తరచూ గస్తీ నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పాతబస్తీ ప్రాంతాల్లో నిఘా కొరవడడంతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసుల గస్తీ ముమ్మురంగా ఉండేదని, ఆ తర్వాత కూడా సీసీ కెమెరాలతో పాటు విజిబుల్ పోలీసింగ్‌కు గత ప్రభుత్వం వరకు ప్రాధాన్యత ఉందని రెండేండ్లుగా ఈ పరిస్థితే కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై పెట్రోలింగ్ లేకపోవడంతో రోడ్లపై దుండగులు కత్తులతో సంచరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల సమీక్షలు, క్రైమ్ రివ్యూలు కేవలం ఉపన్యాసాలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్ సపోర్ట్‌తో పోస్టు తెచ్చుకున్న కొందరు అధికారులు రోజువారీ సంపాదనపైనే దృష్టి పెడుతున్నారని, ఉన్నంతకాలం ఏదో అలా పనిచేశామనిపించుకోవడం తప్ప.. నేరాల అదుపుపై శ్రద్ధలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. రాత్రిళ్లు గస్తీకాయాల్సిన పోలీసులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప.. తిరగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే నేరాలు పెరిగిపోతున్నాయని నగరవాసులు అంటున్నారు.
వరుస ఘటనలివే..!
కొరవడిన నిఘా..!
శివారు ప్రాంతాల్లో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నా పోలీసులు వాటిని నివారించే స్థాయిలో పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం లేదంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అనేది నేడు ఔటర్ వరకు విస్తరించింది. రెండు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఔటర్ లోపల ఉన్న గ్రామీణ ప్రాంతాలు పట్టణంలో కలిశాయి.
ఇప్పుడు అన్ని ప్రాంతాలలో ఏకరీతంగా పోలీసు సేవలు అందించాల్సిన అవసరముంటుంది.
అంటే శివారుల్లో కూడా మరింత పెట్రోలింగ్ వ్యవస్థను పెంచాల్సిన అవసరముంటుంది. శివారుల్లో ఎక్కువ నిర్జన ప్రదేశాలుండడంతో అసాంఘిక శక్తులకు అడ్డగా కొన్ని ప్రాంతాలు మారుతున్నాయి. ఆకతాయి బ్యాచ్‌లు అక్కడే తిష్ట వేస్తూ హాల్చల్ చేస్తున్నాయి. శివారు ప్రాంతాలు అనే భావనతో సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. వెంటనే పోలీసింగ్‌ను పటిష్టం చేయాల్సిన అవసరముంది.