సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి విద్యార్థులు, యువత సిద్ధం కావాలని పలువురు విద్యావేత్తలు పిలుపునిస్తున్నారు. 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని నగర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివేకానంద జీవితంపై పలు విద్యా సంస్థలు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నాయి. విద్యార్థులు, యువజనుల కోసం ప్రత్యేకంగా క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచే పలు సంస్థలు సంస్కృతి, సంప్రదాయబద్ధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేషనల్ యూత్ ఫెస్ట్‌లో భాగంగా శ్రోతలకు కవిత్వ శ్రవణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
స్వామి వివేకానంద జీవితం విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలి. దేశ విదేశాల్లో భారతీయ సంస్కృతిని, సోదరభావాన్ని ఇనుమడింపజేసిన వివేకానంద ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు పలు రకాల క్రీడలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. 8 నుంచి 11వ తేదీ వరకు పలు అంశాల్లో పోటీలు జరుగనున్నాయి. 12న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.
– వాణి, కేశవ్ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపాల్