శేరిలింగంపల్లి, డిసెంబర్ 24: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ రిక్రుట్మెంట్ బోర్డు పరీక్షల్లో ఏఐ సహాయంతో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఇద్దరు యువకులు కాపీయింగ్ పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామాల కోసం ఇటీవల నోటిపికేషన్ విడుదల చేశారు. ఈనెల 21న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వర్సిటీ క్యాంపస్ అవరణలో రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరైన హర్యానా రాష్ర్టానికి చెందిన అనిల్ తన చెవిలో ఉన్న చిన్నపాటి బ్లూటూత్ నుంచి పదే పదే బీప్ సౌండ్ రావడం, తరచూ బాత్రుమ్‌కు వెళ్లి రావడం గమనించిన ఇన్విజిటేటర్ అతడిని క్షణ్ణంగా తనిఖీలు చేశారు.
అనిల్ షర్టుకు ఉన్న స్కానర్ బయటపడింది. స్కానర్‌తో ప్రశ్న పేపర్ స్కాన్ చేసి బాత్రూంకు వెళ్లి ఏఐ సహాయంతో సమాధానాలు చెవిలో ఉన్న బ్లూటూత్ సహాయంలో విని రాస్తున్నట్లు గుర్తించారు. హైటెక్ తరహాలో కాపీయింగ్ పాల్పడిన అనిల్‌ను అదుపులోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు మిగతా వారిని తనిఖీలు నిర్వహించారు. హర్యానాకే చెందిన మరో యువకుడు సతీశ్ సైతం ఇదే తరహాలో కాపీయింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించి ఇద్దరు యువకులు అనిల్, సతీష్‌లను పోలీసులకు అప్పగించారు. యూనివర్సిటీ రిజిష్ట్రర్ దేవేశ్ నిగమ్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.