సిటీబ్యూరో, ఏప్రిల్ 23 ( నమస్తే తెలంగాణ ) : పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హైదరాబాదీ టూరిస్టులు అప్రమత్తమయ్యారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు నగరవాసులు కశ్మీర్ సందర్శనకు ప్రణాళికలు చేశారు. అందులో భాగంగా ట్రావెల్స్‌ను ఆశ్రయించి వివిధ ప్యాకేజీల కింద టూర్స్ బుక్ చేసుకున్నారు. కానీ మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో పలువురు టూరిస్టులు చంపబడటంతో కశ్మీర్ ప్రయాణాన్ని నగర టూరిస్టులు రద్దు చేసుకున్నారు.
అందులో భాగంగా నగరానికి చెందిన ఆరు గురు కుటుంబ సభ్యులు కశ్మీర్‌కు వెళ్లాల్సి ఉండగా, ఉగ్రదాడితో వారి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని 68 ఎం హాలిడేస్ ఎండీ సయ్యద్ ముర్తజా తెలిపారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి కశ్మీర్ టూర్ వెళ్లడానికి నలుగురు కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల వరకు ట్రావెల్స్ చార్జీ చేస్తాయి. చాలా మంది నగరవాసులు వేసవి సెలవులకు కశ్మీర్‌నే ఎంచుకుంటారు. అది మాకు చాలా ముఖ్య డెస్టినేషన్. జమ్ము, కశ్మీర్‌కు సుమారు 800- 900 వరకు బుకింగ్స్ అవుతున్నాయని ముర్తజా చెప్పారు. క్లౌడ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండీ సయ్యద్ వాసీం మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి కశ్మీర్ డొమెస్టిక్ ట్రావెల్ లిస్టులో అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు.
మే అండ్ జూన్ పర్యటన కోసం తాము 270 -360 ఫ్యామిలీలకు బుకింగ్స్ చేశామని వివరించారు. కానీ ఈ ఉగ్ర దాడి టూరిస్టుల ఆనంద భరిత జీవితాన్ని చెదరగొట్టిందన్నారు. మేలో ఉన్న టూర్ ప్యాకేజీలను సైతం తక్షణమే రద్దు చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు ప్రతీ రోజు రెండు ఫ్లైట్లను నడుపుతున్న ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు తమ టికెట్లు రద్దు చేయాలని ప్రయాణికులు, ట్రావెల్ ఏజెన్సీలు పెద్ద ఎత్తున కాల్స్ చేసి కోరుతున్నట్టు సంస్థలు తెలిపాయి.