సిటీబ్యూరో, జూన్ 9(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి దోహదపడుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధికి అవసరమైన పనులను చేపట్టేందుకు తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రధానంగా పరిసరాలను పరిశుభ్రం చేయడమే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఏడో రోజైన గురువారం గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతం అయ్యింది. పారిశుద్ధ్య నిర్వహణ, మొకలు నాటే స్ధలాల గుర్తింపు, పట్టణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, నాలా పూడిక తీత, గుంతలు పూడ్చడం లాంటి పనులు చేపట్టారు. 30 సర్కిళ్లలో 150 వార్డులలో 404 కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఏడు రోజుల వ్యవధిలో 2,932 కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.