జవహర్నగర్, ఆగస్టు 8: అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశభక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మేయర్ మేకల కావ్య అన్నారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కావ్య అధ్యక్షతన వజ్రోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్యోతిరెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ నగేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, ఆగస్టు 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 75వ స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను కార్పొరేషన్ పరిధిలో ఘనంగా నిర్వహించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి పేర్కొన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల పై దిశానిర్ధేశం చేశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన, జాతీయ భావాలను కలిగించే సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొనారు.