ఘట్కేసర్, జూన్ 9: దేశంతో పాటు రాష్ర్టానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ.66 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలతో పాటు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేయూతనిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు రూ.7,300 కోట్లను ప్రభుత్వం కేటాయించిదని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో మున్సిపాలిటీలో రెండు క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.
ఘట్కేసర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా, రూ.66 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు 13వ వార్డు బుగ్గబావి ప్రాంతంలో క్రీడా ప్రాంగణం ప్రారంభం, పటేల్ నగర్లో డ్రైనేజీ పనికి, వీకర్‌సెక్షన్ కాలనిలో సీసీ రోడ్డు, కాలేజ్ రోడ్డులో డ్రైనేజీ పనులకు, కొండాపూర్‌లో మరో క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడం జరిగిందని మంత్రి వివరించారు. కమిషనర్ వసంత, రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు జాంగీర్, హేమలత గోపాల్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పి. వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి బి.రాధాకృష్ణ ముదిరాజ్, రైతు సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎం.జంగయ్య యాదవ్, ఎం.శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.