Fake Websites | సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ): పేరొందిన వ్యాపార సంస్థల డీలర్‌షిప్‌లు ఇప్పిస్తామని బురిడీకొట్టించిన బీహార్, యూపీ ముఠా సభ్యులను గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. యూపీ, బీహార్‌కు చెందిన ప్రధాన నిందితుడు రాకేశ్‌కుమార్ తన అనుచరులు మహ్మద్ ఖాలిద్, యోగేందర్ కుమార్, పంకజ్ సరస్వత్, సరిత, రోషిణీ సింగ్ గౌతంలతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా కేఎఫ్‌సీ సంస్థకు చెందిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. వాటిని ఫేస్ బుక్, ఇన్స్టాగ్రాం, ఇతర సోషల్ మీడియా మార్గంలో ప్రచారం చేశాడు. ఆ వెబ్సైట్లో కేఎఫ్‌సీ డీలర్షిప్ ఇస్తామని వివరించారు. ప్రతి 10 నిమిషాలకు ఓసారి ఈ నకిలీ వెబ్సైట్లు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షమయ్యేల స్కెచ్ వేశారు. ఎవరైనా ఆకర్షితులై వెబ్సైట్లను సంప్రదించగానే వారితో టెలీ కాలర్స్ ద్వారా మాట్లాడి బోల్తా కొట్టించారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు పరిశీలిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
బాచుపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఈ నకిలీ వెబ్సైట్లో వివరాలను నింపాడు. దీంతో రాకేశ్ కుమార్ తన టెలీకాలర్స్ ద్వారా ఫోన్ చేయించి మీకు కేఎఫ్‌సీ డీలర్షిప్ ఖాయమని చెప్పి వివిధ సర్టిఫికెట్లు, ఇంటీరియర్, రిజిస్ట్రేషన్ పత్రాలకు చార్జీలు కట్టాలంటూ మొత్తం రూ.95 లక్షలు వసూలు చేశారు. చివరకు డీలర్షిప్ రాకపోవడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి రాకేశ్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ ముఠా కేఎఫ్‌సీ పేరుతోనే కాకుండా ఐటీసీ, టాటా, ఇఫ్కో, ఐఎంజీ, హెర్బల్ అయుర్వేద, జాకీ ఇలా దాదాపు 30 వెబ్ సైట్లను రూపొందించి వాటిద్వారా పెద్దమొత్తంలో వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్సింగన్వర్, సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బృందం పాల్గొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులను అందించారు.