దుండిగల్, జూలై 5 : ప్రియుడి మోజులో పడి.. కట్టుకున్న భర్త గొంతు నులిమి హత్య చేసిందో భార్య. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణపేట మండలం, కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)తో ధన్వాడ మండలం, రామకిష్టయ్యపల్లికి చెందిన రాధకు 11 ఏండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట ముంబైకి వలస వెళ్లి కూలీ పనులు చేసేవారు.
అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఏర్పడింది. తరచూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుండడంతో విషయం తెలుసుకున్న భర్త అంజిలప్ప.. భార్యను మందలించాడు. రాధలో మార్పు రాకపోవడంతో ఇటీవల అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
మణికొండలో కొన్నిరోజుల పాటు కూలీ పనులు చేసి..నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వజ్ర ప్రతీక్ అపార్ట్మెంట్లో నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ అక్కడే గుడిసెల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గతనెల 22న అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. అందరి ముందే భార్యను తిట్టాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. లేబర్ కాంట్రాక్టర్.. దంపతులకు సర్ది చెప్పాడు. తాగిన మైకంలోలోనే అంజిలప్ప నిద్రలోకి జారుకోగా.. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రాధ తన భర్త ఛాతీపై కూర్చుని గొంతు నులిమి హత్య చేసింది.
ఏమీ ఎరగనట్టు పక్కనే ఉన్న వేరేవారి గుడిసెలోకి వెళ్లి.. భర్త తనను తాగి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి అక్కడే నిద్రించింది. అనంతరం 23న తెల్లవారుజామున నిద్రలేచి గుడిసెలోకి వెళ్లిన రాధ తన భర్త అధికంగా మద్యం తాగి చనిపోయాడని రోదిస్తూ అందర్నీ నమ్మించడంతో పాటు మృతదేహాన్ని అంబులెన్స్‌లో కోటకొండకు తీసుకువెళ్లింది. అక్కడ అంతిమ సంస్కారానికి ముందు అంజిలప్ప గొంతుపై గాయాలను గుర్తించిన అతని సోదరుడు, కుటుంబసభ్యులు మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ను బాచుపల్లి పీఎస్‌కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన బాచుపల్లి పోలీసులు గతనెల 26న మృతుడి కుటుంబసభ్యులను విచారించడంతో పాటు ఈనెల 1న రాధను సైతం అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. నేరాన్ని రాధ అంగీకరించడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.