Hyderabad | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జులై 10 (నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో భర్త సయ్యద్ అక్రమ్ (40)కు నాంపల్లి జిల్లా కోర్టు జడ్జి సురేష్ జీవితఖైదు విధిస్తూ తీర్పు ప్రకటించారు. ఫస్లాన్సర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇంటిలో తన భార్యను అనుమానించి రోకలితో తలపై బాదడంతో ఆమె మృతి చెందినట్టు విచారణలో తేలడంతో నిందితుడిపై శిక్షలు ఖరారు చేసింది. ముగురు పిల్లల్ని స్కూలు దగ్గర దించి వస్తున్న సమయంలో నిందితుడు రోకలితో తన భార్యకు ఎదురుగా వెళ్లి తలపై బాదడంతో అక్కడికక్కడే మరణించిందని, 2016లో మృతిరాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.వేంకట్రెడ్డి ఏసీపీ సమక్షంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణాధికారి కె.ఎమ్.రాఘవేంద్ర సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసి చార్జీషీట్ను కోర్టుకు సమర్పించారు. తొమ్మిదేండ్ల క్రితం నిందితుడితో వివాహం జరిగిందని, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని ఫిర్యాదులో తెలిపారు. భార్యను అనుమానించి పలుమార్లు కొట్టేవాడని ఫిర్యాదులో తెలిపారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా నిందితుడుపై నేరం రుజువు కావడంతో శిక్షలు ఖరారు చేసింది. అదేవిధంగా రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని సూచించింది.