మేడ్చల్, జూలై 4: అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఐదు నెలల చిన్నారికి తల్లిని లేకుండా చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఘటనా స్థలం నుంచి పాపను వదిలి భర్త పారిపోయాడు. ఈ దుర్ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని కేఎల్ఆర్-ఎన్జేఆర్ నగర్లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..
ఆంధ్రప్రదేశ్లోని కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబుతో ప్రశాంతి(22) వివాహం ఏడాదిన్నర కిందట జరిగింది. ఆ దంపతులకు ఐదు నెలల పాప ఉన్నది. రాంబాబు వృత్తి రీత్యా మేస్త్రీగా పని చేస్తున్నాడు. నెల రోజుల కిందట మేడ్చల్లోని కేఎల్ఆర్-ఎన్జేఆర్నగర్లో అద్దెకు ఉంటున్నారు. పెండ్లి అయిన నాటి నుంచి రాంబాబు ప్రశాంతిని అనుమానంతో వేధిస్తున్నాడు.
ఈ విషయమై తరుచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. కుటుంబ పెద్దలు ఇరువురికి నచ్చజెబుతూ వచ్చారు. పాప పుట్టిన తర్వాత అయినా రాంబాబు మారకపోతాడా అని భావించారు. అయితే అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరిగి, రాంబాబు భార్యను గొంతు నులిమి హత్య చేశాడు.
చనిపోయాక ఐదు నెలల పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. శుక్రవారం ఉదయం బంధువులు రాంబాబుకి ఫోన్ చేయగా.. ఫోన్ స్విఛాప్ వచ్చింది. దీంతో వారు ఇంటికి వచ్చి చూసేసరికి ప్రశాంతి మృతి చెంది ఉన్నది. పాప పక్కన ఏడుస్తూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏసీపీ శంకర్రెడ్డి, ఎస్ఐలతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించాడు. అక్కడి పరిస్థితులను పరిశీలించి, ప్రశాంతిని భర్త రాంబాబు హత్య చేసినట్టు నిర్ధారించారు.