వెంగళరావునగర్,జనవరి 20 : అనుమానం పెనుభూతమైంది.. అర్ధరాత్రి వేల గాఢ నిద్రలో ఉన్న భార్య తలపై రోకలిబండతో మోది కడతేర్చాడు ఆ కిరాతకుడు.. నాలోని సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నానంటూ వాట్సాప్‌లో స్టేటస్ మెసేజ్ పెట్టుకుని పరారయ్యాడు.. ఈ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు,స్థానికుల కథనం ప్రకారం..బోరబండ రాజీవ్‌గాంధీనగర్ లో నివాసం ఉండే రొడ్డ ఆంజనేయులు(43), సరస్వతి(32) దంపతులకు కూతురు(9), కుమారుడు(11) ఉన్నారు. నాగర్‌కర్నూల్ కొల్లాపూర్‌కు చెందిన సరస్వతికి వనపర్తి, చింతకుంటకు చెందిన ఆంజనేయులుతో 14 ఏండ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది.
ఆంజనేయులు తన మిత్రులతో కలిసి కార్లను కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య సరస్వతి ఎమ్మెల్యే కాలనీలో హౌస్‌కీపింగ్ పనిచేస్తుండేది. అయితే.. భార్య సరస్వతిని భర్త ఆంజనేయులు తరచూ అనుమానిస్తుండేవాడు. భార్యను కొడ్తూ హింసించేవాడు. అతని వేధింపులు ఎక్కువకావడంతో ఇటీవల ఆమె తన పుట్టింటికెళ్లింది. ఈ నెల 17న ఆంజనేయులు తన అత్తింటివారితో మాట్లాడి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి భార్యాపిల్లలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో రోకలిబండతో సరస్వతి తలపై మోది దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.
అమ్మ నిద్రపోతుందని బిడ్డల్ని నమ్మించి..
అర్ధరాత్రి వేళ అలికిడికి నిద్రలేచారు ఆ పసిబిడ్డలు. అమ్మ నిద్రపోతుంది..మీరు నిద్రపోండి..నేను మళ్లొస్తానని కన్నబిడ్డలకు చెప్పి ఆ చీకట్లో అక్కడి నుంచి ఉడాయించాడు ఆంజనేయులు. నాన్న బయటకు వెళ్లగానే ఆ పిల్లలు ఇంట్లో లైట్లు స్విచ్ఛాన్ చేసి రక్తపుమడుగులో కన్నతల్లి విగతజీవిగా కనిపించడంతో బోరుమన్నారు. అమ్మా లే.. అమ్మా లే అంటూ ఎంతగా అర్తనాదాలు చేసినా.. ఉలుకూ పలుకూ లేకుండా నిర్జీవంగా పడి ఉన్నది. వెంటనే తమ మేనమామ ప్రశాంత్ కుమార్‌కు వీడియో కాల్ చేసి..తల్లిని చూపిస్తూ రోధించారు. వెంటనే ప్రశాంత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తనపై కూడా తన బావ కత్తితో దాడి చేశాడని 2022లో జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు పెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. క్లూస్ టీమ్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
హత్యచేసి.. వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని..
తన భార్యను హత్యచేసి.. నాలోని సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నానంటూ తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు నిందితుడు ఆంజనేయులు. బంగారం లాంటి భార్య, రత్నాల్లాంటి బిడ్డలు ఉన్నప్పటికీ..లేనిపోని అనుమానాలతో భార్యను కడతేర్చి..ఆ పసిబిడ్డలకు తల్లిని దూరం చేశాడు. అమ్మ మృతదేహంపై పడి ఆ బిడ్డలు విలపిస్తున్న తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఇటు తల్లి హత్యకు గురవడం..అటు తండ్రి పరారవడంతో అనాథులుగా మిగిలారు ఆ చిన్నారులు.
కర్నాటకలో నిందితుడు ఆంజనేయులు..?
కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆంజనేయులు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడు కర్నాటకకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతన్ని పట్టుకునేందుకు బోరబండ పోలీసులు గాలిస్తున్నారు. భార్యను తరచూ అనుమానిస్తూ కొట్టేవాడని..ఇంత దారుణంగా కడతేర్చుతాడని తాము భావించలేదని హతురాలి కుటుంబీకులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.