కొండాపూర్, జూన్ 6 : అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చేందుకు కత్తితో(Knife) దాడి చేసిన(Attacked) సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చందానగర్(Chandanagar) పోలీసు స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే తులసి (45), కొంత కాలంగా భర్త జగన్నాధంతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ స్థానికంగా కర్రీ పాయింట్ నడుపుతూ, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది.
కాగా, జగన్నాధం తరచుగా ఆమె ఉన్న చోటుకు వచ్చి గొడవపడుతుండే వాడని, జూన్ 5వ తేదీ తులసి కర్రీ పాయింట్ వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో తన వెంట తీసుకువచ్చిన కత్తితో ఒక్కసారిగా ఆమె పై దాడికి పాల్పడ్డాడు. గొంతు, ఛాతి, మోచేతులపై కత్తితో పొడిచి హత్యచేసేందుకు యత్నించాడు. దాడి సమయంలో తులసి బిగ్గరగా కేకలు వేయడంతో జగన్నాధం అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు తులసిని స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.