ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్‌కు భారీ స్పందన..
తొలివిడుత 5 వేలమందికి ఉచిత శిక్షణ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 76 శాతం మంది హాజరు
36 కేంద్రాల్లో అర్హత పరీక్షకు 16 వేలమంది
ఎంపికైన వారికి 3 నెలలు ఉచిత శిక్షణ
యువత సద్వినియోగం చేసుకోండి
నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, ఏప్రిల్ 5 : పోలీసు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? అయితే సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణలో పాల్గొనండి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన పిలుపునకు హైదరాబాద్ యువత నుంచి విశేష స్పందన లభించింది. పోలీస్ శాఖలో సుమారు 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండడంతో, పోటీ పరీక్షకు నిరుద్యోగ యువతను సిద్ధం చేసేందుకు పోలీసు శాఖ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఐదు జోన్లలో ఏర్పాటు చేసే శిక్షణాకేంద్రాల్లో శిక్షణకు సుమారు 21 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేసేందుకు మంగళవారం హైదరాబాద్‌లో సుమారు 36 కేంద్రాలలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు 16 వేల మంది హాజరయ్యారు. మ. 2.30 గంటల నుంచి సా. 5.30 గంటల వరకు పరీక్ష జరుగగా 76 శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన 5 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. నిరుద్యోగుల నుంచి మరోసారి దరఖాస్తులను ఆహ్వానించి, వారికి కూడా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి రెండో బ్యాచిని ప్రారంభించేందుకు నగర పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణ బాధ్యతను చూస్తున్న అదనపు డీసీపీ మధుకర్ స్వామిని సీపీ అభినందించారు. ఉచిత శిక్షణకు భాగ్య కిరణ్ శిక్షణా సంస్థ పోలీసు శాఖకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నది.
పరీక్షా కేంద్రాల పరిశీలన
స్క్రీనింగ్ పరీక్ష జరుగుతున్న కేంద్రాలను సీపీ సీవీ ఆనంద్ పరీశీలించారు. సెంట్రల్ జోన్ పరిధిలో చిక్కడ్‌పల్లిలోని అరోరా కాలేజీలోని పరీక్షా కేంద్రాన్ని, వెస్ట్‌జోన్ హబీబ్‌నగర్‌లోని అన్వర్ ఉల్ ఉలుమ్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి జోన్లో రెండు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, 5 వేల మందికి మూడు నెలల పాటు పటిష్టమైన శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. రాబోయే పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3300 ఖాళీలు భర్తీకానున్నాయని చెప్పారు. సీపీ వెంట వెస్ట్, సెంట్రల్ జోన్ డీసీపీలు జోయల్ డెవీస్, రాజేశ్ చంద్ర, అదనపు డీసీపీలు మధుకర్‌స్వామి, రమణారెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్, ట్రాఫిక్ ఏసీపీ మురళీధర్‌తో పాటు భాగ్య కిరణ్ పోలీస్ కోచింగ్ సెంటర్ ఎండీ భాగ్య కిరణ్ తదితరులు ఉన్నారు.
చాలా మంచి నిర్ణయం
ప్రభుత్వం, నగర పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషకరం. శిక్షణా కాలంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వమే వసతి కల్పిస్తే బాగుంటుంది.
– సునీల్, పటాన్చెరు
నిరుద్యోగులకు ఉపయోగం
పోలీసు శాఖ కల్పించిన ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పరీక్షలను రాశాను. ఎంట్రెన్స్ పాసైన యువతీ, యవకులకు ఎంతో ఊరట నిస్తుంది. నిరుద్యోగ పేద యువతకు ఈ ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – రాము, చిలకలగూడ
పోలీస్‌శాఖకు ధన్యవాదాలు
పోలీస్ శాఖలో చేరాలనే తాపత్రయం ఉంది. నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయం. పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ అర్హత పరీక్షను బాగా రాశాను. కచ్చితంగా ఈ పరీక్షలో పాస్ అయి… పోలీస్‌ని అవుతాననే నమ్మకం ఉంది. అవకాశాన్ని కల్పించిన పోలీస్‌శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు. –ఓ. శ్రీనివాస్, అభ్య
మంచి అవకాశం
ఉద్యోగ సాధనలో ఉచిత శిక్షణ కల్పించేందుకు ముందుగానే పరీక్ష నిర్వహించడం గొప్ప విషయం. స్ఫూర్తినింపేలా పోలీసు అధికారులు నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించారు. ఈ పరీక్షతో అభ్యర్థుల్లో ఆసక్తి పెరుగుతుంది.
– పృథ్వీ, మెహిదీపట్నం
ఆత్మవిశ్వాసం పెరిగింది
ఈ రోజు రాసిన పరీక్షతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎగ్జామ్ చాలా ఈజీ గా ఉంది. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలను పెంచింది. ప్రణాళికతో ముందుకు వెళ్లేలా దారిచూపుతుంది. – గణేశ్, మెహిదీపట్నం
చిన్ననాటి కోరిక
పోలీస్ అవ్వాలన్న నా చిన్ననాటి కోరిక త్వరలో తీరనుంది. పోలీసులే స్వయంగా శిక్షణ ఇవ్వడం బాగుంటుంది. ఇందుకు తగిన తర్ఫీదుగా ముందుగానే పరీక్ష నిర్వహించడం అభినందనీయం. అందరికీ ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
– జి.రాధిక, ఎల్బీ నగర్
గొప్ప ఆలోచన
పోలీసు ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. అయితే ఇందుకు వేల రూపాయలు పెట్టి శిక్షణ తీసుకోలేను. నాలాంటి పేద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉచిత శిక్షణను అందిచడమనేది చాలా గొప్ప ఆలోచన. ఈ పరీక్ష పాసైన యువతకు ఇది ఎంతో ఉపయోగకరం. – మనీశ్, మారేడ్‌పల్లి
నిరుద్యోగులకు వరం
ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేయడం చాలా గొప్ప విషయం. ఈ క్రమంలో పేదల ఇబ్బందులు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వమే ఉచిత శిక్షణను అందించడం నిరుద్యోగులకు గొప్ప వరం. ఈ పరీక్షలో పాసై ఉచిత శిక్షణ పొందితే ఉద్యోగం పొందడం సులభమవుతుంది. – వంశీ, సికింద్రాబాద్
11 కేంద్రాలలో పరీక్ష
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు హాజరైన వారిలో తాము తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలనే తపన కనిపించింది. వెస్ట్‌జోన్‌లో 60 శాతంపైగా దరఖాస్తుదారులు పరీక్షకు హాజరయ్యారు. 11 కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా అందులో ఒకటి తెలుగు మీడియం వారి కోసం ఏర్పాటు చేశాం.
– జోయల్ డెవీస్, వెస్ట్‌జోన్ డీసీపీ
మంచి స్పందన ఉంది
నిరుద్యోగులకు పోలీస్‌శాఖలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఇచ్చిన ప్రకటనతోనే చాల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నార్త్‌జోన్‌లో 3537 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా సుమారు 70 శాతం పరీక్షకు హాజరవ్వడంతో మంచి స్పందన లభించింది. హైదరాబాద్‌లో వాళ్లే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న వారు, హైదరాబాద్‌లో స్థిరపడాలనుకునేవారు ఈ ఉచిత శిక్షణ అర్హత పరీక్షకు హాజరయ్యారు.
– చందనాదీప్తి, నార్త్‌జోన్ డీసీపీ
ఉత్సాహంగా ఉన్నారు
పరీక్షకు హాజరైన వారిలో ఉత్సాహం ఉంది. ఉద్యో గం సాధించాలనే కసితో ఉన్నారు. స్క్రీనింగ్ పరీక్ష పేపర్‌ను చూసి నిరుద్యోగ యువత సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పత్రం అన్ని అంశాలతో ఉన్నప్పుడే తమ ప్రతిభకు గుర్తింపు లభిస్తోందని, పోలీసులు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రాజేశ్ చంద్ర, సెంట్రల్ జోన్ డీసీపీ
ఊహించిన దానికంటే భారీ స్పందన
సౌత్జోన్లో యువత భారీ స్థాయిలో పరీక్షకు హాజరయ్యారు. 80 శాతంపైగా నిరుద్యోగ యువత స్క్రీనింగ్ పరీక్ష రాశారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ప్రశ్నా పత్రాలను తయారు చేసి, ఆయా కేంద్రాలను కూడా వేరుగా ఏర్పాటు చేశాం. ఆరు కేంద్రాలలో స్క్రీనింగ్ పరీక్ష జరిగింది. – సాయి చైతన్య, సౌత్ జోన్ డీసీపీ
స్క్రీనింగ్ నుంచే పోటీకి సంసిద్ధం
స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేయడంతో అసక్తి ఉన్నవారే తరగతులకు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశాం. అబిడ్స్‌లో మూడు కేంద్రాలలో తెలుగు, ఓయూలో 7 కేంద్రాలలో ఇంగ్లిష్ పేపర్‌తో పరీక్ష నిర్వహించాం. 60 శాతానికిపైగా పరీక్షకు హాజరయ్యారు.
– సతీశ్, ఈస్ట్‌జోన్ డీసీపీ
రాచకొండలో 7 వేల మంది దరఖాస్తు
ఏప్రిల్ 7 వరకు గడువు
సిటీబ్యూరో, ఏప్రిల్ 5 : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణకు మంగళవారం వరకు 7 వేల మంది దరఖాస్తు చేస్తుకున్నారు. దరఖాస్తులకు ఏప్రిల్ 7వ తేది వరకు గడవు ఉంది. మల్కాజిగిరి, ఎల్బీనగర్, యాదాద్రి-భువనగిరి డీసీపీ జోన్లలోని మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో శిక్షణా తరగతుల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.