బంజారాహిల్స్, డిసెంబర్ 15: బిగ్‌బాస్ ఫైనల్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జూబ్లీహిల్స్ రోడ్ నం.5లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది బిగ్‌బాస్ టైటిల్‌ను పల్లవి ప్రశాంత్ గెలిచిన సందర్భంగా భారీఎత్తున హింస చెలరేగడంతోపాటు ఆస్తులు ధ్వంసం కావడం, పోలీసుల సూచనలు బేఖాతరు చేస్తూ వేలాది మంది అభిమానులు ర్యాలీ నిర్వహించడం తదితర ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగవద్దనే ఉద్దేశంతో నిర్వాహకులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు.
బిగ్‌బాస్ పోటీదారులను ఒకేసారి బయటకు పంపించవద్దని, ఫైనల్స్ ముగిసిన వెంటనే వేర్వేరుగా వారిని పంపించాలని సూచించారు. ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని, అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కల నిషేధాజ్ఞలు విధించారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అదనపు బలగాలను రప్పించారు. బంజారాహిల్స్ రోడ్ నం.2 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌కు వచ్చే రోడ్డులో రాకపోకలను నియంత్రించి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లే రోడ్డును బారీకేడ్లతో మూసేశారు. ఎక్కువ మంది గుమికూడకుండా ఎప్పటికప్పుడు వారిని చెదరగొట్టారు. ఎలాంటి అల్లర్లు జరిగినా బిగ్‌బాస్ నిర్వాహకులదే బాధ్యత అని స్పష్టమైన హెచ్చరికలు చేశారు.