సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): షేర్ మార్కెటింగ్‌లో అధిక లాభాలు వచ్చే విధంగా టిప్స్ ఇస్తామంటూ నమ్మించి మోసాలు చేస్తున్న ఏపీకి చెందిన సైబర్‌నేరగాళ్ల ముఠాను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్ర వివరాలను వెల్లడించారు. చిత్తూరు- అన్నమయ్య జిల్లాకు చెందిన తిప్పనగారి సాయి సరన్కుమార్ రెడ్డి ఇంటిగేర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమెటెడ్ పేరుతో పీలేర్లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ 38 మంది మహిళా టెలీకాలర్స్‌తో ఒక కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. సెబీలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా..
ఎలాంటి అర్హత లేకున్నా తాము ట్రేడింగ్ అడ్వయిజరీ చేస్తామంటూ కాల్‌సెంటర్ నుంచి టెలీకాలర్స్ ఫోన్లు చేస్తుంటారు. ఇందులో ఫ్లోర్ మేనేజర్లుగా కొతోళ్ల మహేశ్, రెడ్డివారి హరిబాబు యాదవ్, టీమ్ లీడర్లుగా కొర్రు అజిత్, దివాకర్‌గా పనిచేస్తున్నారు. ట్రేడింగ్ చేసే వారి డేటాను సేకరిస్తున్న వీరు బాధితులను నమ్మిస్తున్నారు. ఆ తరువాత డిమాట్ ఖాతా, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి, వాటిలోని డబ్బును ఇతర ఖాతాలకు మళ్లిస్తారు. తరువాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తారు. ఈ విధంగా దేశ వ్యాప్తంగా 140 మంది నుంచి రూ. 1.08 కోట్ల వరకు ఈ ముఠా మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని డీసీపీ వివరించారు. ఈ ముఠా ఎనిమిది నెలలుగా మోసానికి పాల్పడుతుందన్నారు. నమ్మకంగా కనిపించేందుకు ఒక ఫేక్ వెబ్‌సైట్‌ను కూడా ఈ ముఠా నిర్వహిస్తుంది.
నగరానికి చెందిన ఓ బాధితుడు ఈ ముఠా మాటలు నమ్మి రూ.2.6 లక్షలు మోసపోయాడు. దీంతో బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పీలేర్లోని కాల్‌సెంటర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్పెక్టర్ హరిభూషణ్ బృందం ఈ మోసానికి సంబంధించిన తీగను లాగడంతో ఈ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసి. వారి వద్దనుంచి ఆరు ఫోన్లు, 31 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏసీపీ శివమారుతీ తదితరులు పాల్గొన్నారు.