సిటీబ్యూరో/ఉప్పల్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ.. ఒక్కొక్కరి నుంచి రూ. 1000 వసూలు చేస్తూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ..ప్రకటన చేశాడు. సూర్యపేట జిల్లా రాజునాయక్ తండాకు చెందిన హరీశ్ తాను ప్రాంఛైస్ తీసుకోవాలని భావించాడు.
సల్మాన్‌తో మాట్లాడాడు. ఢిల్లీకి శిక్షణ కోసం తన అనుచరుడైన నాగోల్‌కు చెందిన రాజశేఖర్‌ను పంపించాడు. ఈ నేపథ్యంలోనే హరీశ్ తాను బట్ట తల ఉన్న వాళ్లకు మూడు నెలల్లో వెంట్రులకు మొలిపిస్తానంటూ మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఉప్పల్ భాగాయత్లోని శిల్పారామం వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో వందలామంది బుధవారం అక్కడకు చేరుకున్నాడు. వారి వద్ద డబ్బులు తీసుకొని.. గుండు గీసీ.. షాంపు రద్ది పంపించారు.
పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిబిరం హరీశ్, రాజశేఖర్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపూరితమైన ప్రకటన ఇచ్చి అందరిని ఆకర్షించినట్లు గుర్తించి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ డబ్బులు తమకు వాపస్ ఇప్పించాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు మాత్రం ఇదంతా చట్ట విరుద్ధ్దంగా నడుస్తుండడంతో తాము కేసు నమోదు చేశామని చెబుతున్నారు.