Ration Cards | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రేషన్ కార్డు దరఖాస్తుదారులకు మీసేవలో చుక్కెదురవుతున్నది. ప్రజాపాలన, వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోనివారు మీసేవలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మీసేవ కేంద్రాలకు అర్జీదారులు బారులు తీరుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో వందకు 70 శాతం మందికి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నట్లు సూచిస్తుండటంతో కంగు తింటున్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న చాలామందికి ‘అలాటెడ్’ అని సూచిస్తుండగా మరికొంతమందికి ‘డూప్లికేట్’ అని వస్తుందని వారు వాపోతున్నారు. తమకు రేషన్ కార్డు లేకున్నా ఉన్నట్లు ఎలా వస్తుందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాటెడ్ అని సూచిస్తున్న వారిని రేషన్ దుకాణాలు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాలకు వెళ్లి అడగాలని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారని అంటున్నారు. ప్రభుత్వం సూచించినట్లుగానే దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల నుంచి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడమే కానీ సరైన మార్గదర్శకాలు జారీ చేసి అర్హులను గుర్తించిన దాఖలాలు లేవు. దరఖాస్తుల పేరిట జిరాక్సులకే వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అర్జీదారులు వాపోతున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడంతో ఒక్కొక్కరు రెండు మూడు సార్లు దరఖాస్తు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా.. రేషన్ కార్డు వస్తదనే నమ్మకమైతే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టి తమకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
ఇప్పటిదాకా రేషన్ కార్డులు మహిళల పేరుతోనే జారీ చేశారు. తాజా దరఖాస్తు చేసుకునే వాళ్లు కూడా ఇంటి యజమానిగా మహిళలనే సూచించాలని అధికారులు చెబుతున్నారు. కానీ ఒంటరిగా ఉండే పురుషులు, భార్య చనిపోయిన వారు తమ పేరుతో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. కానీ మీ సేవ కేంద్రాల్లో పురుషుల పేరుతో దరఖాస్తు చేస్తే ఆన్లైన్లో అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఇంటి యజమానిగా మహిళ పేరు నమోదు చేస్తేనే దరఖాస్తు తీసుకుంటుందని అంటున్నారు. దీంతో ఒంటరిగా ఉండే వారు, భార్య చనిపోయిన వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పేరును మహిళగా నమోదు చేయాలని మీసేవ కేంద్రాల నిర్వాహకులను వేడుకుంటున్నట్లు చెబుతున్నారు. దరఖాస్తు దారులు బతిమాలడంతో కొన్ని కేంద్రాల్లో పురుషులను కూడా మహిళలుగా నమోదు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వమేమో పురుషుల పేరిట కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చని చెబుతున్నా ఆన్లైన్లో మాత్రం స్వీకరించకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇప్పటిస్తామంటూ మధ్య దళారులు దరఖాస్తుదారులకు వల వేస్తున్నారు. ఒక్కొక్క అర్జీదారుడి నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. తాము దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు రావడం ఖాయమని భరోసా కల్పిస్తూ దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మీసేవ నిర్వహకులు రూ.50 కంటే ఎక్కువ తీసుకోవద్దని, అంతకంటే ఎక్కువ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. పనులు మానుకుని మీసేవలో గంటల తరబడి వేచి ఉండటం ఎందుకని భావించిన వారు దళారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదే అదనుగా భావించి అమాయక ప్రజల నుంచి వేలల్లో దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పిస్తామంటూ దళారులు రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.