సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశంలోని పురాతన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటి. విద్యారంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగంపేటలోని హెచ్‌పీఎస్ 2023నాటికి వందేండ్లకు చేరుకున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది పొడువునా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. ముంగింపు వేడుకలకు పాఠశాల ఆవరణంలో చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 22 నుంచి 27 వరకు నిర్వహించే ముగింపు ఉత్సవాలకు అన్ని దేశాల నుంచి పూర్వ విద్యార్థులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈనెల 19న ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి హాజరవుతున్నట్లు హెచ్‌పీఎస్ వైస్ ప్రిన్సిపాల్ అమృత చంద్ర తెలిపారు.
వచ్చే మూడేండ్లలో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.100కోట్లు సమీకరించనున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఇందుకు పూర్వవిద్యార్థుల సహకారంతో పాటు వారి చేయూతను స్వీకరించనున్నట్లు పేర్కొన్నది. కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన పరిస్థితుల్లో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న స్కూల్ విద్యార్థుల ఫీజుల కోసం కీలకంగా వ్యవరించారని వివరించింది. పూర్వ విద్యార్థుల ద్వారా సేకరించిన నిధులతో ఇన్నోవేషన్ సెంటర్, మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్, ఐజీసీఎస్ఈకి నూతన భవన సముదాయం, నూతన తరగతి గదుల సముదాయం, ప్రాథమిక, మాధ్యమిక అత్యాధునిక ల్యాబొరేటరీ ఆధునీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ఈవెంట్లలో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంపై హెచ్‌పీఎస్ దృష్టి సారిస్తున్నదని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. రాబోయే ఐదేండ్లలో 12 నుంచి 15 కోట్ల మేరకు నిధులను అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు.
సమగ్రమైన విద్యను అందించాలనే తపనతో హెచ్‌పీఎస్ యాజమాన్యం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తున్నది. ఇంటర్నేషనల్ స్కూళ్లతో పోలిస్తే.. విద్యార్థులు అతి తక్కువ ఫీజుతోనే చదువుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా విజ్ఞానం, సంపూర్ణ విద్యను సులభంగా అభ్యసించే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించడంలో హెచ్‌పీఎస్‌కు సాటిలేరని చెబుతున్నారు. ఒలింపిక్ చాంపియన్‌షిప్, సినిమా, పాలిటిక్స్, థియేటర్ ఆర్ట్స్, కళలు, వ్యవస్థాపన లాంటి రంగాల్లో హెచ్‌పీఎస్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిస్తున్నారు.
వందేండ్ల వేడుకల్లో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్సోవేషన్ కౌన్సిల్ సహకారంతో దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ సైన్స్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. దర్పన్ అకాడమి ఆఫ్ పెర్పార్మింగ్ ఆర్ట్స్‌కు చెందిన డాక్టర్ మల్లికాసారాబాయ్ బృందం ‘ది డ్యాన్స్ ఆఫ్ లైఫ్’ పేరుతో అద్భుతమైన భరతనాట్యం డ్యాన్స్ థియేటర్ ప్రదర్శన వేడుకలను ఉర్రూతలూగించింది. మల్లికాసారాబాయ్ కూడా ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. భవిష్యత్తులో స్టార్టప్‌లను తీర్చిదిద్దేందుకు 4వేల నుంచి 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ సెంటర్‌ను విద్యార్థుల కోసం అందుబాటులోకి తేనున్నది. ఓపెన్ ఎయిర్ థియేటర్లో దేశంలోని సింఫనీ ఆర్కెస్ట్రా నాణ్యత కలిగిన పాశ్చార్య శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు స్వచ్ఛమైన శాస్త్రీయ పాశ్చాత్య రూపంలో దృష్టి కేంద్రీకరించడానికి హెచ్‌పీఎస్ టాటా కల్చరల్ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నది.