బడంగ్‌పేట, ఆగస్టు 24: మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మాంఖాల్ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 68,70,71,73,85, 86లో ఉన్న 24.12 ఎకరాల ప్రభుత్వ భూములకు రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు.. పోలీసుల సహాకారంతో గత రెండు రోజులుగా ఫెన్సింగ్ వేసే పనులను చేపడుతున్నారు.
ఆర్దీవో జగదీశ్వర్ రెడ్డి, మహేశ్వరం డీటీ నరేష్, హెచ్ఎండీఏ ఎస్ఈ అప్పారావు, క్రిష్ణయ్య, సర్వేయర్ సతీష్ రెడ్డి ఆదివారం దగ్గర ఉండి సీలింగ్ భూములలో ఫెన్సింగ్ వేయించారు. అయితే అధికారులు తప్పుడు సర్వే నిర్వహించి మా భూములు తీసుకోవడం భావ్యం కాదని బాధితులు పేర్కొంటున్నారు. గ్రామ నక్ష ఆధారంగా టీపన్ పెట్టి సర్వే చేయాలన్నారు. 1984లో ఆ భూములు సేల్ డీడ్ అయినట్లు బాధితులు పేర్కొన్నారు.
విలేజ్ మ్యాప్ ద్వార చూసి టీపన్ పెట్టి సర్వే చేయించిన తర్వాతనే భూములు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది రియల్ వ్యాపారులు కూడా అధికారులను అడ్డుకున్నారు. పట్టాలు ఉన్న భూమిని తీసుకోవడం లేదని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి రియల్ వ్యాపారులకు చెప్పారు. సర్వే చేసిన తర్వాత పట్టా భూమి చూపిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్, అసైన్డ్ భూమిని అమ్ముకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఇకనుంచి ప్రభుత్వ భూమిని ఎవరు కొన్నా, అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు.