హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని అత్తాపూర్లో దారుణం చోటుచేసుకున్ని. ఇంటి కిరాయి చెల్లించలేదని (Room Rent) యజమాని చేసిన పని యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. అత్తాపూర్ హసన్నగర్లోని ఓ ఇంట్లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం కిరాయికి ఉంటున్నది. ఎప్పుడూ సక్రమంగానే అద్దె కట్టే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల కారణంగా గత నెల రెంట్ చెల్లించలేదు. దీంతో రెంట్ ఇవ్వాలంటూ ఇంటి యజమాని అడగడం మెుదలుపెట్టాడు. ప్రస్తుతం చేతిలో నగదు లేదని, మరికొన్ని రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ పట్టించుకోని.. ఓనర్ ఆ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు.
రెంట్ కడితేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తానని అతడు చెప్పడంతో.. వారిమధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. రెచ్చిపోయిన యజమాని అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడిచేశాడు. విచక్షణారహితంగా యువతి తల, చేతిపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితురాలిని హుటాహుటిన స్థానిక దవాఖానకు తరలించారు. అనంతరం అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.