Hyderabad Metro | సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోలో అదనపు బోగీల (కోచ్) ఏర్పాటుకు ఎట్టకేలకు హెచ్ఎంఆర్ఎల్ దృష్టి సారించింది. ఏడాది కాలంగా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నా.. ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ ఈ నెలాఖరులోగా నగరానికి కొత్త బోగీలను తీసుకువచ్చేలా హెచ్ఎంఆర్ఎల్ చర్యలు చేపట్టింది. ఇందుకు గాను రద్దీగా ఉండే మార్గాలను తొలి దఫా అందుబాటులోకి తీసుకు రానున్నారు. అమీర్‌పేట్, రాయదుర్గ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వంటి స్టేషన్లను విపరీతంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, నాలుగు అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణే మెట్రో నుంచి లీజుకు తీసుకోనున్నట్లుగా తెలిసింది. గడిచిన కొంతకాలంగా నిత్యం ఐదున్నర లక్షలకు పైగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసు సమయాల్లో నాగోల్-రాయదుర్గ్ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. కిక్కిరిసిన జనాలతో స్టేషన్లన్నీ నిండిపోతున్నాయి. అయినా రద్దీకి అనుగుణంగా బోగీలు అందుబాటులో లేకపోవడంతో.. మరో రైలు వచ్చేంత వరకు ప్లాట్‌ఫాంపై ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా బోగీలను పెంచాలనే డిమాండ్ చేస్తున్నా… అటు మెట్రో కానీ, ఎల్ అండ్ టీ కానీ పట్టించుకోలేదు. తాజాగా ప్రయాణికుల ఒత్తిడి మేరకు బోగీలను పెంచేందుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రద్దీ సమస్యకు పరిష్కారం..
నిజానికి గత ఏడాది జులై నాటికే కొత్త బోగీలను ఏర్పాటు చేసుకోవాలని మెట్రో భావించింది. కానీ ఎల్ అండ్ టీ ఆసక్తి చూపలేదు. ఇప్పటికే నిర్వహణ భారం పేరిట అరకొర వసతులతోనే సేవలను అందిస్తుండగా.. కొత్త బోగీలు అసాధ్యమేనన్నట్లుగా వ్యవహారించింది. ఇక హెచ్ఎంఆర్ఎల్ కూడా అంతగా దృష్టి సారించలేదు. దీంతో మెట్రో ప్రారంభమై దాదాపు ఆరేళ్లు గడిచినా కొత్త బోగీల ఊసే లేకుండాపోయింది. అయితే ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న మెట్రో ప్రయాణికులతో సాధారణ సమయంలోనూ స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడుతున్నది. ఈ క్రమంలో హెచ్ఎంఆర్ఎల్ ఎట్టకేలకు కొత్త బోగీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. తొలి దఫా నాలుగు బోగీలను లీజ్ ప్రతిపాదికన తీసుకువచ్చేలా చర్యలు చేపట్టింది. దీనికోసం పుణే మెట్రో నుంచి ఇంజన్ రహిత బోగీలను తీసుకురానున్నారు.
వచ్చే నాలుగేండ్లలో ఓల్డ్‌సిటీ మెట్రో..!
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చేపట్టే మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇండ్లు, భూములు కోల్పోయిన బాధితులకు మెట్రో స్టేషన్లలో వ్యాపారం చేసుకునేందుకు ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయిన 40 మంది భూ నిర్వాసిత లబ్దిదారులకు రూ.18.63 కోట్ల రూపాయల చెక్కులను కలెక్టర్ అనుదీప్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ఆయన అందించారు. ఈ సందర్భంగా అసదుద్దిన్ మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2 కింద 6వ కారిడార్‌ను 7.5 కిలో మీటర్లలో భాగంగా మెట్రో నిర్మాణ పనులు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మాణ పనులు జరగనున్నట్టు తెలిపారు. రూ.2,741 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టనున్నట్టు తెలిపారు.
నాలుగేండ్లలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. స్టేషన్లను సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, అలియాబాద్, ఫలక్‌నుమాలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. అర్హులైన ప్రాంత వాసులకు మెట్రో స్టేషన్లలో ఉపాది కల్పించాలని కోరారు. లబ్దిదారులకు గజానికి 60వేలు చెల్లించవలసి ఉండగా సీఎం సూచనలతో 81 వేలు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఓల్డ్‌సిటీలో రూ.2741 కోట్లతో అత్యంత ఉన్నత ప్రమాణాలతో చేపట్టే మెట్రోలైన్ కారిడార్ 6ను నాలుగేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ఓల్డ్‌సిటీని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో భూసేకరణ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్వర్ణలత, ఆర్డీఓ రామకృష్ణ, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.