సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ) : పచ్చదనం పెంచాలి, పర్యావరణాన్ని రక్షించాలి. ఇది ప్రభుత్వాల సంకల్పం. కానీ ఇదే అదనుగా చేసుకుని కొందరు అధికారులు మాత్రం కాసుల వర్షం కురిపించే కల్పవృక్షంలా హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగాన్ని మార్చుకున్నారు. ఇంకేముంది ఏటా వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండటంతో ఇక్కడ చేరేందుకు అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. అవకాశం కోసం ఎన్ని దారులైన తొక్కుకుంటూ హెచ్ఎండీఏ బాట పడుతున్నారు. దీంతో హెచ్ఎండీఏలోని ఈ విభాగం ఒక హాట్ కేకులా మారింది. ఎంతలా అంటే డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు కూడా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. హెచ్ఎండీఏలో ఇంజినీరింగ్ విభాగం తర్వాత అత్యంత ఆదాయంలో సింహాభాగం ఖర్చయ్యేది ఈ విభాగంలోనే ఉంది.
సిటీబ్యూరో: హెచ్ఎండీఏ ఏటా దాదాపు రూ. 150 కోట్ల వరకు కేవలం పచ్చదనం పెంచేందుకు ఖర్చు చేస్తోంది. ఏడు జిల్లాల నుంచి 11 జిల్లాలకు విస్తరించిన తర్వాత పార్కులు, నర్సరీలు, మెగా ప్లాంటేషన్లు, వనమహోత్సవం కింద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. హెచ్ఎండీఏలోని ఇతర విభాగాల్లో నిధులు కొరతతో పనులు ఆగిపోయినా, ఈ అర్బన్ ఫారెస్ట్ విభాగానికి మాత్రం నిధుల కొరత ఉండదని, బడ్జెట్ ఎప్పుడూ పుష్కలంగా ఉండటంతో ఈ విభాగంపై అధికారులకు విపరీతమైన ఆదరణ పెరగడానికి అసలు కారణం.
సీటు వదలని అధికారులు.
అటవీ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై హెచ్ఎండీఏకు వచ్చిన అధికారులు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఏమాత్రం అంగీకరించరు. గడువు ముగిసినా, ఉన్నతాధికారులు వెనక్కి రావాలని ఆదేశాలు ఇచ్చినా.. కుర్చీలను పట్టుకుని వేలాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అధికారి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. డిప్యూటేషన్ ముగిసినా, సొంత విభాగానికి వెళ్లకుండా ఉండటానికి వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు. సదరు అధికారి మాత్రం కదలిక లేకుండా అవసరమైతే పొలిటికల్ పవర్‌తో తన కుర్చీని పదిలం చేసుకుంటూనే ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల అర్బన్ ఫారెస్ట్రీలో వచ్చిన కుర్చిలాట వ్యవహారం కూడా అందులో భాగమేనని, సీఎం స్థాయిలో ఈ విభాగంలో ఉన్న నిధులను మొక్కల పేరిట ఖర్చు చేయడమే ప్రధాన ఉద్దేశమనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విభాగంలో జరిగే ఖర్చులకు లెక్కగట్టడం అంతా సులభతరం కాకపోవడమే కొందరి అధికారులకు కల్పవక్షంలా మారిందని విభాగంలోనే చర్చ నడుస్తోంది. అర్బన్ ఫారె్రస్ట్రీ విభాగానికి ఏడాదిన్నర కాలంలో నలుగురు డైరెక్టర్లు మారడం వెనుక అసలు కథ ఇదేనని, ఇక్కడ దొరికే ప్రయోజనాల కోసం ఏ స్థాయి పైరవీకైనా కొందరు అధికారులు ప్రయత్నిస్తుంటారని, ఇక్కడ ఆదాయం, రాజభోగాలు, సంపాదన అవకాశాలే వారిని కుర్చీల కోసం పాకులాడేలా చేస్తుందంటున్నారు. పాలిథిన్ కవర్ల నుంచి వాటర్ ట్యాంకర్ల వరకు అన్ని అవకతవకలేనని, ఇక మ్యాన్‌పవర్ విషయంలో కొందరి అధికారుల తీరు అందె వేసిన చేయిగా మారిందని, ఇక్కడ జరిగే దోపిడీ సముద్రం నుంచి నీటిని తీసినట్లే ఉంటుందని అధికారులు చర్చించుకోవడమే ఇందుకు నిదర్శనం.
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం అమీర్‌పేట్‌లో ఉంటే.. ఈ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం మాత్రం నానక్ రాం గూడలోని హెచ్‌జీసీఎల్ ప్రధాన కేంద్రంగా విధులు సాగుతాయి. అయితే హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల కన్ను పడకుండా వ్యవహారం సాగుతుందని అనుకుంటే పొరపాటే. ఈ విభాగంపై పర్యవేక్షకులే.. భోక్తలనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదులు వస్తేనే విచారణకు ఆదేశించడం, ఆ విచారణతో విషయం కూడా తెలుసుకోకుండా, నివేదిక పూర్తి చేయడం, మరొక అధికారి రావడం, మళ్లీ అదే వ్యవహారాలకు తెరలేపడం ఇక్కడ షరా మామూలేనని హెచ్ఎండీఏ వర్గాలంటున్నాయి. ఇందులో అంతర్ రాష్ట్ర అధికారులు కూడా రాజ్యమేలుతుంటే..అవుట్ సోర్సింగ్ సిబ్బందియే ఇక్కడ సేకరణ కర్తలుగా(కలెక్షన్ బాయ్స్)గా వ్యవహరిస్తున్నారని అధికారులు వచ్చేదే కేవలం నిధులను స్వాహా చేసేందుకు అన్నట్లుగా వచ్చిన ఏ అధికారి అంతిమ లక్ష్యమైన ఒకటే అన్నట్లుగా ముట్టజెబుతారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే కీలక పోస్టులకు సీఎం స్థాయిలో పైరవీలు నడుస్తాయనేది హెచ్ఎండీఏ ఎరిగిన సత్యం.