Kokapet Lands | సిటీబ్యూరో, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అవసరమా? అంటూ కాసులు కురిపించే భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎకరం రూ.వంద కోట్లకు అమ్ముడైన కాలం నుంచి, రేట్లు తగ్గించి ప్లాట్లను విక్రయిస్తామని చెప్పినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల నడుమ విలువైన భూములను వేలం వేసినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమేనని భావిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. బిల్డింగుల నిర్మాణం నుంచి కొత్త లే అవుట్ల అనుమతుల వరకు పర్మిషన్లు రావడమే గగనమైంది. ఇటీవల కాలంలో హెచ్ఎండీఏలో జరుగుతున్న జాప్యాన్ని నివారించే అనుమతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడింది. అనుమతులను పది రోజుల్లో ఇచ్చేందుకు ఉన్నతాధికారులు చొరవతీసుకున్నా.., పడుకున్న మార్కెట్ పరుగులు పెట్ట లేకపోతుంది. ఇలాంటి సమయంలో భూముల వేలం పాట అంటే… అన్ సీజన్లో అమ్మకాలు జరుపుకున్నట్లుగా ఉంటుందనీ హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
కోట్లు కురిపించిన కోకాపేట్ భూముల్లో మిగిలిన 24 ఎకరాల డెవలప్మెంట్ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్లాట్లను డెవలప్ చేస్తూనే మార్కెట్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉండటంతో కోకాపేట్ భూముల వేలంపై అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు.
ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువచ్చే నియోపొలిస్ వెంచర్ ద్వారా అంచనాల మేర ఆదాయం వచ్చే పరిస్థితి లేదని భావిస్తున్నారు. దీంతో పాటు నగరంలో పలు చోట్ల కూడా భూముల వేలానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నా.. హైడ్రా, మూసీ కూల్చివేతలు ఇచ్చిన షాక్ నుంచి కొనుగోలుదారులు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి తరుణంలో వేలం నిర్వహించి ప్రాజెక్టును నీరుగార్చినట్లే అవుతుందని హెచ్ఎండీఏ వర్గాలు భావిస్తున్నాయి.
నిజానికి రాష్ట్రంలో భూముల వేలం కొత్తేమీ కాదు. గత ప్రభుత్వం కూడా భూముల పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వేలం నిర్వహించి, నిధులను సమకూర్చుకుంది. కానీ, వేలానికి ముందు రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన నిర్ణయాలు, అందుకు అవసరమైన మౌలిక వసతులు, పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటుతో ఆయా భూములకు విపరీతమైన డిమాండ్‌ను తీసుకువచ్చింది. అదే విధంగా కొనుగోలుదారులకు అనువైన వాతావరణం కల్పించింది.
కానీ, గడిచిన ఏడాది కాలంగా నగరంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. గతంలో హైదరాబాద్ శివారులో ఏర్పడిన వెంచర్లలో ఓపెన్ ప్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపే జనాలు కూడా కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన ఇబ్బందులతో భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విలువైన భూములకు వేలంతో అమ్మకాలు అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ తేరుకునేంత వరకు భూముల వేలం చేయడం లేదా.. రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడేందుకు ప్రభుత్వమే చొరవ తీసుకుంటే తప్పా… గాడి తప్పిన మార్కెట్ స్థిరత్వం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.