జవహర్నగర్, ఫిబ్రవరి 18: రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. పొద్దున్నే లేచి కాయకష్టం చేసుకుంటే తప్ప నాలుగు ముద్దలు సంపాదించుకోలేని బతుకులు. ఏవో ఇండ్లల్లో పాచిపని చేసుకుంటూనో, కుట్టుమిషన్లు నడుపుకుంటూనో, తోపుడుబండ్లపై చిన్నా చితకా వ్యాపారం చేసుకుంటూనే రోజులు వెళ్లదీసే అత్యంత పేదలు వాళ్లు. జవహర్నగర్ కార్పొరేషన్లో ని హెచ్ఎండీఏ భూములు సర్వే నెం. 702, 706లో పేదలు వేసుకున్న రేకుల ఇళ్ళను హెచ్ఏండీఏ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాయంతో మంగళవారం క్షణాల్లో నేలమట్టం చేశారు.
దాదాపు 10 కుటుంబాలను ఉన్నఫలంగా రోడ్డుకీడ్చారు. గూడు కూల్చొద్దంటూ బతిమిలాడిన వాళ్లను ఈడ్చుకెళ్లారు. కొంతమందిని ఎత్తుకెళ్లారు. ఏళ్ల తరబడి ఓ మూలకు రేకుల షెడ్లలో తలదాచుకుంటున్న వారందరినీ ఎర్రటి ఎండలోనే బయటికీడ్చారు. పేదల ఇళ్ళపై బుల్డోజర్ తీసుకువచ్చి పూర్తిగా కూల్చివేశారు. 40, 60, గజాల్లో చిన్నపాటి రేకులు వేసుకుని జీవనం సాగించేవారందరూ ఇప్పుడు గూడు లేని అనాథలయ్యారు. ప్రజాపాలన అంటే పేదవాడి గూడు కూల్చడమేనా అంటూ వారంతా విలపిస్తూ నిలదీసినా అధికారులెవ్వరూ కరుణించలేదు.