HMDA | సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు తలమానికం కానున్న ఎలివేటెడ్ కారిడార్లు, మీరాలం కేబుల్ బ్రిడ్జిల నిర్మాణంలో హెచ్ఎండీఏ కాలయాపన చేస్తున్నది. ప్రాజెక్టుల ఖర్చు, నిర్మాణ వ్యయం, రెవెన్యూ విషయాలను లోతుగా తెలుసుకునేందుకు అధ్యయనం పేరిట జాప్యం చేస్తున్నది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్లను నియమించుకుని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను హెచ్ఎండీఏ ప్రతిపాదనలకే పరిమితం చేస్తోంది. ఇక సలహాలిచ్చే కన్సల్టెన్సీ నివేదికలు వచ్చేంత వరకు ప్రాజెక్టులను అధికారులు మొదలు పెట్టలేకపోతున్నారు. దీంతో ఆ ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చేదెప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర డెయిరీ ఫామ్ రోడ్డు వరకు నిర్మించనున్న రెండు ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండీఏ ఆరు నెలల కిందట ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ ఇప్పటికీ మొదలు కాలేదు. డిఫెన్స్ శాఖ ఇచ్చిన క్లియరెన్స్ మేరకు పరిహారం చెల్లించాల్సి ఉండగా… ఇప్పటికీ పరిహారం భూముల అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. అయితే ప్రాజెక్టులపై ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసేందుకు ట్రాన్సాక్షనల్ అడ్వైజరీలను నియమించుకోగా, కన్సల్టెన్సీలు ఇచ్చే నివేదిక ఆధారంగానే హెచ్ఎండీఏ ప్రాజెక్టులను పట్టాలెక్కించనుంది.
అడుగు పడేదెన్నడూ?
Hmda
16 కిలోమీటర్ల మేర రెండు ప్రధాన మార్గాల్లో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లు ఇప్పటికే ఖరారైనప్పటికీ… కార్యరూపంలోకి తీసుకొచ్చే విషయంలో హెచ్ఎండీఏ తాత్సారం చేస్తున్నది. ప్రధానంగా నిర్మాణ ఖర్చులు, నిర్వహణ భారంపై అవగాహన లేకపోతే ప్రాజెక్టు వ్యయంపై పూర్తి స్పష్టత లేకనే ప్రత్యామ్నాయంగా టీఏలను నియమించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట మీదుగా తూంకుంట వరకు ఉండే 11 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను సమగ్రంగా పరిశీలించనుంది.
అదేవిధంగా బెంగళూరు హైవే మార్గాన్ని మరింత విస్తరించేలా ఆరులైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు రూపొందించింది. బెంగళూరు హైవే నుంచి చింతల్మెట్ మీదుగా అత్తాపూర్ వరకు 2.65 కిలోమీటర్ల దూరంలో మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నది. ట్రాఫిక్ రద్దీ, రవాణా దూరం తగ్గిపోవడంతోపాటు మీరాలం చెరువును చూసేందుకు వీలు ఉండేలా వ్యూ డెక్, స్కై వాక్‌తోపాటు నెహ్రూ జువాలజికల్ పార్క్‌ను చేరుకునేలా డిజైన్ చేశారు.
అయితే కొత్తగా చేపట్టిన ఈ ప్రాజెక్టులకు ట్రాన్సాక్షనల్ అడ్వైజర్, ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకే కన్సల్టెన్సీలను హెచ్ఎండీఏ మొదటిసారి నియమించింది. ఆ కన్సల్టెన్సీలు ఇచ్చే ఒకవేళ వయబులిటీ లేదని తెలిసే కొన్ని మార్పులు చేస్తూ ప్రతిపాదనలను ఈ ఏజెన్సీలు అందించనున్నాయి. పీపీపీ విధానంలో నిర్మించనున్న ప్రాజెక్టుల విషయంలో ఈ కన్సల్టెన్సీలు ఇచ్చే నివేదికలు కీలకంగా మారినట్లు హెచ్ఎండీఏ వర్గాలు వెల్లడించాయి.