సిటీబ్యూరో: హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ – 2050 మరింత జాప్యం కానున్నది. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏలో ఏకరీతి పట్టణాభివృద్ధియే లక్ష్యంగా గత ప్రభుత్వం పలు మాస్టర్ ప్లాన్లను విలీనం చేసి ఒకే బృహత్ మాస్టర్ ప్లాన్ అమలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఆ ప్రణాళికలను కొంత మార్పు చేసి పరిధి విస్తరించడంతోపాటు, మాస్టర్ ప్లాన్ల విలీనం చేస్తూ మాస్టర్ ప్లాన్ – 2050 సన్నాహాలు చేసింది.
కానీ ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలతో కొంత జాప్యం జరుగుతోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా రవాణా, సరుకు రవాణా, ఆర్థిక మండళ్ల అభివృద్ధియే లక్ష్యంగా బ్లూ, గ్రీన్ మౌలిక వసతులతో కూడిన సమగ్రమైన మాస్టర్ ప్లాన్ ఉండాలని నిపుణులు, ప్రభుత్వం సూచించింది. దీనికి అనుగుణంగానే హెచ్ఎండీఏ సబ్ ప్లాన్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర సర్కారుకు అందించినా… ఇప్పటికీ ఆమోదం తెలుపలేదు. వీటికి ఆమోదం తెలిపితే గానీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన మొదలయ్యే పరిస్థితి లేదని తెలిసింది.
ఒక్క అడుగు ముందుకు పడలేదు..
కాంగ్రెస్ సర్కారు అట్టహాసంగా ప్రకటించిన మాస్టర్ ప్లాన్ – 2050కి ఒక్క అడుగు ముందుకు పడలేదు. క్షేత్రస్థాయిలో ఎదురైతున్న ఇబ్బందులు, ప్రభుత్వంలో జరుగుతున్న జాప్యం మాస్టర్ ప్లాన్ ప్రణాళికలను ఇప్పటికీ పట్టాలెక్కించలేదు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కీలకమైన మూడు ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో.. ఆ అంశంలో ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది.
సబ్ ప్లాన్లతో మాస్టర్ ప్లాన్..
మాస్టర్ ప్లాన్ – 2050లోనే ఇప్పటికే ఉన్న మాస్టర్ ప్లాన్లను సమీకృతం చేయనున్నారు. అదేవిధంగా నూతనంగా మరో మూడు సబ్ ప్లాన్లను కూడా ప్రధాన ప్రణాళికల్లో కలిపి వేయనున్నట్లుగా తెలిసింది. అయితే ప్రభుత్వం చేసిన సూచనలకు అనుగుణంగా హెచ్ఎండీఏ యంత్రాంగం మార్పులు, చేర్పులతో సబ్ ప్లాన్లను రూపొందించినా… ఇప్పటికీ వీటిపై ప్రభుత్వం సమీక్షించలేదు.