HDMA | సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ నిర్ధారణ డైలీ సీరియల్లా మారింది. ఓవైపు చెరువుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రచారం చేసుకుంటుంటే… మరోవైపు చెరువుల పరిరక్షణలో కీలకమైన హద్దుల నిర్ధారణ ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. మొత్తం 3500కు పైగా ఉన్న చెరువుల్లో కనీసం 30 శాతం చెరువులకు కూడా హద్దులను గుర్తించలేకపోయారు. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల గుర్తింపు ప్రక్రియను లేక్ విభాగం అధికారులు సాగదీస్తున్నారు. గడిచిన నాలుగు నెలలుగా గడువు పొడిగించాలని కోరుతున్నారే తప్ప.. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా అన్ని చెరువులకు హద్దులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ను మాత్రం గుర్తించడం లేదు.
లేక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ ప్రక్రియ టైం ల్యాప్స్ కార్యక్రమంలా మారిపోతున్నది. గడిచిన కొన్నేండ్లుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉన్నది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో సమన్వయంలో చేసుకోవడం హెచ్ఎండీఏ విఫలమవుతుండటంతో.. చెరువుల హద్దుల నిర్ధారణ తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా చెరువుల పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలతో ఊదరగొడుతున్న తరుణంలో…. అధికారుల పనితీరు కూడా అందుకు తగినట్లుగానే ఉన్నదనే విమర్శలొస్తున్నాయి. హెచ్ఎండీఏలోని లేక్ విభాగం ఈ చెరువులకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుండగా… జవసత్వాలు లేకుండా నత్తనడకన ఈ ప్రక్రియ నడుస్తోంది.
మొత్తం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 3500కు పైగా చెరువులకు డిసెంబర్ 30లోగా హద్దులను నిర్ధారించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. కానీ ఈ వ్యవహారంలో హెచ్ఎండీఏ లేక్ విభాగం నిర్లక్ష్యం హద్దుల నిర్ధారణ పూర్తి కావడం లేదు. మొత్తం చెరువుల్లో 2700 చెరువులకు మాత్రమే హద్దుల నిర్ధారణ చేసి ప్రాథమిక నివేదిక రూపొందించగా, కేవలం 570 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. ఈ క్రమంలో దాదాపు మూడు వేల చెరువులకు హద్దులను నిర్ధారిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ చేయాల్సి ఉంది.