సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ) : కొత్త ఏడాదిని భూముల వేలంతో మొదలుపెట్టేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తోంది. ఇటీవల జరిగిన భూముల వేలం ద్వారా రూ. 3800 కోట్లను ఆర్జించడంతో అదే తరహాలో మరికొన్ని ల్యాండ్ పార్సిళ్లను విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో కోకాపేట్ నియోపోలిస్కు సమీపంలో ఉన్న 70 ఎకరాల భూమి సిద్ధమవుతున్నది. కేవలం భూములు అమ్మడం ద్వారానే రెవెన్యూ సమకూర్చుకోవాలనే కాంగ్రె స్ సర్కారు లక్ష్యానికి అనుగుణంగా హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. 70 ఎకరాలను 3-5 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్లాట్లు విభజించి విక్రయించనున్నారు.
ఒక్కో ఎకరం ద్వారా రూ. 120-150 కోట్లు వస్తుందని అంచనా వేస్తుండగా, వీటి ద్వారా రూ. 8వేల కోట్ల ఆదాయం వస్తుందంటున్నారు. అయితే ఇందులో రెండు దఫాలుగా ప్లాట్లను విక్రయించాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లుగా సమాచారం. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ప్లాట్ల వారీగా, నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవసరమైన నివేదికలను తయారు చేసే పనిలో అధికారులు ఉన్నారని హెచ్ఎండీఏ వర్గాలు తెలిపాయి.