సిటీబ్యూరో, మే 6: హెచ్ఎండీఏ పరిధిలో మెరుగైన రవాణా, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టేలా.. హెచ్ఎండీఏ ఉమ్టా(యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ఆథారిటీ) రూపొందించిన ప్రణాళికలు అటకెక్కాయి. ట్రాన్స్‌పోర్టు నిపుణుల సాయంతో నగరంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉన్నా.. నెలలు గడుస్తున్నా ప్రజా రవాణా వ్యవస్థ, మాస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం వంటి అంశాలపై సమగ్రమైన అధ్యయనంపై దృష్టి పెట్టడం లేదు.
ట్రాన్స్‌పోర్టు నిపుణులతో ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టాల్సి ఉన్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నగరంలో నానాటికి పెరుగుతున్న వాహనాల రద్దీ, జనాభాకు తగినంతగా రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చినా.. పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలపై అధ్యయనం జరగడం లేదనే విమర్శలున్నాయి.
దీంతో అనివార్యంగానే వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అదే విధంగా గడిచిన కొంతకాలంగా ఉమ్టా అధ్యయనాలు కూడా బుట్టదాఖలు చేశారు. దీంతో నగరంలో కొత్త రవాణా వ్యవస్థ రూపకల్పన, అమలు తీరులో జాప్యం జరుగుతూనే ఉంది. అయితే ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టాల్సిన హెచ్ఎండీ ఉమ్టా చోద్యం చూస్తోంది.
నిపుణుల పర్యవేక్షణ కరువు..
నగర రవాణా వ్యవస్థ అభివృద్ధిలో హెచ్ఎండీఏ ఉమ్టాది ప్రధానపాత్ర. ఇక్కడ ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టు విధానాలను రూపొందించడంతోపాటు, అమలు చేయడంలోనూ హెచ్ఎండీఏ కే కీలక బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యంగా జంక్షన్ల అభివృద్ధి, కారిడార్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల రూపకల్పన, సమగ్ర రవాణా ప్రణాళికలతోపాటు, ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ వంటి ప్రాజెక్టులను ఉమ్టా పర్యవేక్షించాల్సి ఉంది. వీటితోపాటు, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రవాణా వ్యవస్థల డిజైన్లు తయారు చేయడం, వాటిని పరిశీలించడం, అవసరమైన మార్పులు చేర్పులతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారు చేసే బాధ్యతలను నిపుణులు పర్యవేక్షించాల్సి ఉండగా..ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. ప్రణాళికలు రూపొందించి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
పరిధి పెరిగినా.. అధ్యయనం ముచ్చటేది?
ఏడు జిల్లాల నుంచి పదకొండు జిల్లాలకు హెచ్ఎండీఏ విస్తరించినా.. ఇప్పటికీ పాతకాలం నాటి అధ్యయనాలు, గణాంకాలు మాత్రమే జరుగుతున్నాయి. కనీసం పెరిగిన పరిధికి అనుగుణంగా, కొత్తగా అందుబాటులోకి వచ్చే ట్రిపుల్ ఆర్(ఆర్ఆర్ఆర్)నైనా పరిగణనలోకి తీసుకుని ట్రాన్స్‌పోర్టు నివేదికలు రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా, ప్రజా రవాణా వ్యవస్థల డిమాండ్‌కు అనుగుణంగా అధునాతన రవాణా సౌకర్యాలను కల్పించాలంటే ఉమ్టా నివేదికలు కీలకం.
గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నగరంలో సైకిల్ ట్రాక్‌ల కోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసుకుని అధ్యయనం చేసి, ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాకులను కూడా ఏర్పాటు చేసింది. ప్రజావసారలకు అనుగుణంగా వీటిని నిర్వహించింది. అయితే తదనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పేరిట హడావుడి చేస్తుందే తప్పా.. నార్త్ సిటీ అవసరాలు, ఇతర రవాణా సదుపాయాలు, రవాణా వ్యవస్థను సమన్వయం చేసే నివేదికలను తయారు చేయడంలో కీలక భూమిక పోషించే ఉమ్టా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.