కోకాపేట భూముల వేలంతో ఖజానా నింపుకొన్న సర్కారు.. ఇక బుద్వేల్ లే అవుట్లో మిగిలిన ప్లాట్లకు రంగం సిద్ధం చేస్తున్నది. మూడు దశల్లో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్ ప్రాజెక్టులోని 7 ప్లాట్ల ద్వారా దాదాపు రూ. 3700 కోట్లను సర్కారు ఆర్జించింది. ఇదే ఊపుతో మిగిలిన బుద్వేల్ లే అవుట్‌పై దృష్టి సారించింది. గతంలో బుద్వేల్‌లో ఐటీ పార్కులను ఏర్పాటు చేసిన సర్కారు… విస్తృతమైన ప్రయోజనాల కోసం కంపెనీలకు విక్రయించింది. కానీ ఇప్పుడు ఆదాయం ప్రాధాన్యతగా భూముల వేలం నిర్వహిస్తున్న కాంగ్రెస్ సర్కారు బుద్వేల్ భూములను తెరమీదకు తీసుకువచ్చింది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)
150 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ డెవలప్ చేసిన బుద్వేల్ ఐటీ పార్కులో ఇప్పటివరకు 100 ఎకరాల విక్రయం జరిగింది. మిగిలిన 30 ఎకరాల విస్తీర్ణంలో నాలుగైదు ప్లాట్లను వేలం వేసేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతున్నది. హిమయత్‌సాగర్‌కు సమీపంలో, అవుటర్ రింగు రోడ్డు, ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండేలా ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి చేసింది. 2023లో నిర్వహించిన భూములు వేలం ద్వారా ఏకంగా రూ. 3600 కోట్ల రెవెన్యూ తీసుకువచ్చింది. అయితే మిగిలిన భూముల విషయంలో గడిచిన రెండేండ్లుగా మార్కెట్ పడిపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన కోకాపేట భూముల వేలానికి వచ్చిన ఆదరణతో మిగిలిన ప్లాట్లను కూడా విక్రయించాలని సన్నాహాలు చేస్తున్నది.
ఐటీ కారిడార్‌కు సమీపంలోనే
ప్రస్తుతం ఉన్న ఐటీ కారిడార్‌కు సమీపంలోనే ప్రత్యామ్నాయ ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో బుద్వేల్‌తోపాటు, అవుటర్‌కు సమీపంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ ఐటీ పార్క్‌కు బీఆర్ఎస్ సన్నాహాలు చేసింది. అయితే బుద్వేల్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న అప్పటి సర్కారు రూ. 200 కోట్లతో మౌలిక వసతులు కల్పించింది. ఆ వెంటనే భూముల వేలం నిర్వహించగా, విశేషమైన ఆదరణ వచ్చింది. ఇందులో మిగిలిన ఐదారు ప్లాట్లను కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుకు తీసుకు వచ్చింది. కానీ మార్కెట్లో ఉన్న ప్రతికూలతలు వేలం ప్రక్రియను ముందుకు సాగకపోయింది. ఎట్టకేలకు కోకాపేట ఫలితాన్ని చూసిన సర్కారు.. బుద్వేల్ భూములను విక్రయించి ఖజానా నింపుకోవచ్చని భావిస్తున్నది.