సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హెచ్ఎండీఏ పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నది. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యంతో పాటు పార్కుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ.. ఇలా అనేక పనులు చేపట్టేందుకు స్థానిక మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో సరిపడా నిధులు లేకపోవడంతో హెచ్ఎండీఏ నిధులు వెచ్చిస్తున్నది. తెల్లాపూర్ పరిధిలో మంథన్ లేక్ నుంచి చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావడంతో ఆ మార్గంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏ నిధులతో చేపట్టనున్నారు.
ఇందుకోసం సుమారు రూ.1.88 కోట్లను వెచ్చించి పనులు చేపట్టేందుకు ఇటీవల అధికారులు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను చేపట్టనున్నారు. తెల్లాపూర్ ప్రాంతం ఐటీ కారిడార్‌కు అతి సమీపంలో ఉండటంతో ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట నుంచి తెల్లాపూర్ వెళ్లే రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ నుంచి గౌలిదొడ్డి, గోపన్‌పల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి కొల్లూరు వరకు రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇలా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి సైతం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నది.